Hyderabad
Hyderabad | ఎట్టకేలకు చిక్కిన చిరుత

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో 12 రోజులుగా అధికారులకు నిద్ర లేకుండా చేసిన చిరుత (Leopard) ఎట్టకేలకు చిక్కింది. నగరంలోని గోల్కొండ, ఓఆర్​ఆర్​ సమీపంలో గల మృగవాని పార్క్​, గ్రే హౌండ్స్​ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దానిని పట్టుకోవడానికి అధికారులు అనేక చర్యలు చేపట్టారు. తాజాగా మంచిరేవుల (Manchirevula)లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దానిని నల్లమల అడవుల్లో (Nallamala Forest) వదిలేస్తామని ప్రకటించారు.

Hyderabad | ముప్పు తిప్పలు పెట్టి..

నగర శివారులో 12 రోజుల క్రితం చిరుత సంచరిస్తుండగా కొందరు గమనించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గోల్కొండ (Golconda), లంగర్​హౌస్​ శివారులోని ఆర్మీ స్థావరాలు, అజీజ్​ నగర్​ సమీపంలో గల మృగవాని పార్క్ (Mrugavani Park)​ అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు దానిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చిరుత అధికారుల చేతికి చిక్కకుండా నగరంలో చక్కర్లు కొడుతూ ముప్పు తిప్పలు పెట్టింది.

Hyderabad | 8 ట్రాప్​ కెమెరాలు.. 4 బోన్లు

చిరుతను పట్టుకోవడానికి అధికారులు 8 ట్రాప్​ కెమెరాలు, నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు. 12 రోజులుగా దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipet) మండలం మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పెట్టనున్నారు.