US President Trump
US President Trump | వారు ఏం చేసుకున్నా సంబంధం లేదు.. భార‌త్‌, ర‌ష్యా సంబంధాల‌పై ట్రంప్ వ్యాఖ్య‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: US President Trump | ఇండియాపై 25 శాతం సుంకాలు విధించిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యా మ‌ధ్య ఉన్న స‌న్నిహిత సంబంధాల‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రష్యా(Russia)తో భారత్ ఏ వ్యాపారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. రష్యా, భారత్ కలిసి వారి కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తాజాగా త‌న సోష‌ల్ మీడియా ట్రూత్ ​లో ఓ పోస్ట్ పెట్టారు.

US President Trump | ఐ డోంట్ కేర్‌..

భారతదేశం-రష్యా సంబంధాలను మ‌ధ్య ఉన్న సంబంధాల‌పై ట్రంప్(US President Trump) మ‌రోసారి అక్క‌సు వెల్ల‌గ‌క్కారు. మాస్కోతో న్యూఢిల్లీ లావాదేవీల గురించి తాను పట్టించుకోనని( ఐ డోంట్ కేర్‌) పేర్కొన్నారు. ర‌ష్యాతో భార‌త్(India) ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుక‌న్నా త‌న‌కు సంబంధం లేద‌న్నారు. వారి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌త‌నం చేసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ(New Delhi)తో త‌మ వ్యాపారం చాలా ప‌రిమిత‌మ‌ని, అందుకు భార‌త్ అత్య‌ధికంగా విధిస్తున్న సుంకాలే కార‌ణ‌మని తెలిపారు. ప్రపంచంలోనే అత్య‌ధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అని మ‌రోసారి అక్క‌సు వెల్ల‌గ‌క్కారు. ఇదే స‌మ‌యంలో ర‌ష్యాతో అమెరికా(America) ఎలాంటి వ్యాపారం చేయ‌డం లేద‌ని గుర్తు చేశారు.

మ‌రోవైపు ర‌ష్యా మాజీ అధ్య‌క్షుడు దిమిత్రి మ‌ద్వెదేవ్‌(Dmitry Medvedev)పై ట్రంప్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ‌తో అమెరికా గేమ్ ఆడుతుంద‌ని, అది యుద్ధానికి దారి తీయోచ్చ‌న్న మ‌ద్వెవేక్ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న సీర‌య‌స్‌గా స్పందించారు. దిమిత్రి ఇంకా అధ్య‌క్షుడినేన‌ని అనుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్నారు.

US President Trump | 25 శాతం సుంకాల విధింపు..

రెండోసారి అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత వాణిజ్య యుద్ధానికి తెర లేపిన ట్రంప్‌.. భార‌త్‌పై భారీగా సుంకాలు(Huge Tariffs) విధిస్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఇండియా నుంచి దిగుమ‌త‌య్యే వ‌స్తువుల‌పై 25 శాతం టారిఫ్‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. భార‌త్ త‌మ‌కు మిత్ర దేశ‌మే అయిన‌ప్ప‌టికీ, ఆ దేశం త‌మ‌పై అత్య‌ధిక ప‌న్నులు వేస్తోంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆగస్టు 1 నుంచి సుంకాలు అమ‌లులోకి వ‌స్తాయ‌న్నారు. “గుర్తుంచుకోండి, భారతదేశం మిత్రదేశం అయినప్పటికీ, మేము సంవత్సరాలుగా వారితో చాలా తక్కువ వ్యాపారం చేశాము ఎందుకంటే వారి టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయిజ. వారు ఏ దేశంలోనూ లేనంత కఠినమైన. అసహ్యకరమైన ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులను కలిగి ఉన్నారు” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

US President Trump | ర‌ష్యాతో సంబంధాల‌పై అస‌హ‌నం..

అదే స‌మ‌యంలో భార‌త్ ర‌ష్యాతో స‌న్నిహిత సంబంధాలు కొనసాగించ‌డాన్ని ట్రంప్ త‌ప్పుబ‌ట్టారు. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన ర‌ష్యా నుంచి ఇండియా చ‌మురు(India Oil) కొంటున్న‌ద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. “అలాగే, వారు (ఇండియా) ఎల్లప్పుడూ రష్యా నుంచే సైనిక పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఉక్రెయిన్‌లో హత్యలను రష్యా ఆపాలని అందరూ కోరుకుంటున్న సమయంలో భార‌త్ చ‌మురును కొనుగోలు చేస్తోంది. ఇలా చేయ‌డం మంచిది కాదు. ఆగస్టు 1 నుండి భారతదేశ ఉత్ప‌త్తుల‌పై 25% సుంకం అమ‌లవుతుంది” అని తెలిపారు.

US President Trump | స్పందించిన భార‌త్‌..

అమెరికా విధించిన 25 శాతం సుంకాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఆచితూచి స్పందించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ట్రంప్ ప్రకటనను ప‌రిశీలిస్తున్నామ‌ని, ప్రస్తుతం టారిఫ్‌ల పెంపు వ‌ల్ల వ‌చ్చే చిక్కులను అధ్యయనం చేస్తున్నామ‌ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని నెలలుగా ఇండియా, అమెరికా మధ్య న్యాయమైన, సమతుల్యమైన, పరస్పరం ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖ‌రారు చేసుకోవ‌డంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. అయితే రైతులు, చిరు వ్యాపారుల సంక్షేమాన్ని రక్షించడం, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందని తెలిపింది.