
అక్షరటుడే, వెబ్‌డెస్క్: World Champions of Legends | వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ – పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన గ్రూప్ దశ మ్యాచ్ నిరసనల మధ్య రద్దయిన విషయం తెలిసిందే. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియా ఛాంపియన్స్ (India Champions) జూలై 31న జరగాల్సిన తొలి సెమీస్‌లో పాకిస్తాన్‌తో తలపాడాల్సి ఉండగా, ఆ సెమీఫైనల్ మ్యాచ్ రద్దయ్యింది. WCL 2025 సెమీఫైనల్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో (Birmingham) జరగాల్సి ఉండగా, భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో ఆడటానికి ససేమీరా అనడంతో మ్యాచ్ రద్దు అయ్యింది.
World Champions of Legends | వైదొలిగిన భారత్..
ఈ క్రమంలో, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో పాకిస్తాన్(Pakistan) ఫైనల్‌కు చేరింది. ఆగస్టు 2న బర్మింగ్‌హమ్‌లో జరగనున్న ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది. అయితే దేశభక్తి, క్రీడా స్ఫూర్తి మధ్య తలెత్తిన ఈ సంఘర్షణ నేపథ్యంలో కొందరు ఆటగాళ్లు పాకిస్తాన్‌తో ఆడేదే లేదని అనడంతో మ్యాచ్ రద్దు (Match Cancellation) చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంపై డబ్ల్యూసీఎల్ అఫీషియల్‌గా (WCL Official) స్పందిస్తూ.. భారత్ ఛాంపియన్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నామని పేర్కొంది. అలానే ఈ టోర్నీని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న పాకిస్తాన్ నిర్ణయాన్ని కూడా సమానంగా గౌరవిస్తామని పేర్కొంది.
మరోవైపు ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి (Nishant Pitty).. తన సోషల్ మీడియాలో భారత్-పాక్ మ్యాచ్‌కు తమ స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ‘‘క్రికెట్‌కు టెర్రరిజంతో సంబంధం లేదు, రెండూ కలిసి నడవలేవు,’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో (World Championship of Legends) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు మేము టీమ్ ఇండియాను అభినందిస్తున్నాము, మీరు దేశాన్ని ఎంతో గర్వపడేలా చేశారు అని అన్నారు. మొత్తానికి భారత ఆటగాళ్లు, బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ గ్రూప్ దశలో నిలకడ లేని ఆటతీరు వలన ఇండియా ఛాంపియన్స్ అతి కష్టమ్మీద సెమీస్‌లో చోటు సంపాదించుకుంది. చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో మంచి రన్‌రేట్‌తో సెమీస్‌కు చేరింది. అయితే సెమీస్‌లో పాక్‌తో మ్యాచ్ ఉండడంతో ఆడకూడదని నిర్ణయించుకుంది.