అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణ(Telangana)లో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో భారీ పన్ను ఎగవేత బయటపడింది.
హైదరాబాద్(Hyderabad)లోని ప్రైవేటు సంస్థ ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీ (MS Kishan Industries LLP) ప్రధాన పాత్ర ఉన్నట్లు తేలింది. మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్ (Kalakal Automotive Park), సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట గోదాం (Bansilalpet Godam), ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని ప్రొడక్షన్ యూనిట్లలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.
భారీ విలువ కలిగిన కాపర్ సరకులను సరఫరా చేయకున్నా.. చేసినట్లు పన్ను బిల్లులు జారీ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర(Maharashtra)కు ఖాళీ వాహనాలను పంపించి, దస్త్రాల్లో మాత్రం భారీ సరకుల రవాణా జరిగినట్లు లెక్కలు చూపించినట్లు నిర్ధారించారు.
GST fraud : టోల్గేట్ డేటా ఆధారంగా..
మోసపూరిత బిల్లుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేసింది. జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా ఈ భారీ జీఎస్టీ మోసం వెలుగు చూసింది.
ఈ మాయదారి సంస్థ దాదాపు రూ.33.20 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. రిజిస్టర్లు, ఖాతా పుస్తకాలు, హార్డ్ డిస్కులు, సీసీ ఫుటేజీ తదితర ఆధారాలను స్వాధీనం చేసుకుంది.
సంస్థ డైరెక్టర్లు రజనీష్ కీషాన్, వికాష్ కుమార్ కీషాన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీని వాణిజ్య పన్నుల శాఖ కోరింది.
ఇదే కేసులో మరో ఘటనకు సంబంధించి.. చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్ డీఎస్టీవో మజీద్ హుస్సేన్ ఒక మోసాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వెలుగు చూసిన మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వాణిజ్య పన్నుల శాఖ (Commercial Tax Department) కమిషనర్ కె. హరిత ప్రకటించారు.