అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సహకార సంఘాల ఎరువుల గిడ్డంగులను కలెక్టర్ సందర్శించారు.
అంతకుముందు కమ్మర్పల్లి (Kammarpally) పీహెచ్సీ(PHC)ని తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరును కలెక్టర్ పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డు, లాబొరేటరీ, ఫార్మసీ గదులను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్, గర్భిణుల వివరాల నమోదు, ఆరోగ్య పరీక్షలు, సబ్ సెంటర్ల పరిధిలో కొనసాగుతున్న ఆరోగ్య సేవలు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న ముందస్తు చర్యలు తదితర అంశాలపై పనితీరును సమీక్షించి, రికార్డులను పరిశీలించారు.
ప్రతి గర్భిణికి సంబంధించి రిజిస్ట్రేషన్ తప్పనిసరి జరగాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం(ANM)లు, ప్రతి గర్భిణి వివరాలను ఆశా కార్యకర్తలు (ASHA workers) నమోదు చేసి, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోని వారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు.
లింగ నిర్ధారణ (gender determination) కోసం ఎవరైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం చేసేందుకు అవకాశాలు ఉన్నందున, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఆశాలు, ఏఎన్ఎం లు నిశిత పరిశీలన చేయాలన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ, అబార్షన్ లు వంటివి జరుగుతున్నట్లు గమనిస్తే, పై అధికారులకు వెంటనే సమాచారం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని రకాల మందులు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణులకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాల్లోని సహకార సంఘాల ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేశారు.
కమ్మర్పల్లి ఎరువుల గోడౌన్(fertilizer godown) లో స్టాక్ బోర్డుపై వివరాలు ప్రదర్శించకపోవడం గమనించిన కలెక్టర్, సొసైటీ కార్యదర్శిని నిలదీశారు. అప్పటికప్పుడు స్టాక్ వివరాలు రాయించారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ రైతులకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలన్నారు.
Collector : ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గల ఆయిల్ పామ్ నర్సరీని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. నర్సరీలోని మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతుండటం చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగుకు సరిపడా మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని నర్సరీ నిర్వాహకులు తెలిపారు. ఆయిల్ పామ్ పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ, రైతులు ఆయిల్ పామ్ సాగు విరివిరిగా చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అన్నారు. కలెక్టర్ వెంట ఉద్యాన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు తదితరులున్నారు.