Nagireddy Pet
Nagireddy Pet | భర్త హత్యకు సుపారీ: కటకటాలపాలైన భార్య

అక్షరటుడే, లింగంపేట: Nagireddy Pet | అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయడానికి సుపారీ ఇచ్చింది ఓ భార్య. చివరికి గాయాలతో భర్త ప్రాణాలు దక్కించుకోగా.. భార్య సహా ప్రియుడు, మరో ముగ్గురు కటకటాల పాలయ్యారు. అరెస్టయిన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నాడు. హత్యాయత్నానికి సంబంధించిన వివరాలను మంగళవారం ఎల్లారెడ్డి (Yellareddy) డీఎస్పీ శ్రీనివాస్​రావు (DSP Srinivas Rao) వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరు (Chinna athmakuru) గ్రామానికి చెందిన ఆశా వర్కర్ (Asha worker) సంపూర్ణకు అదే గ్రామానికి చెందిన జాన్సన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తన సంబంధానికి భర్త రవి అడ్డుగా ఉన్నాడని, అతడిని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర చేసింది.

ఈ క్రమంలో ప్రియుడు జాన్సన్​కు భర్త పాస్​పోర్ట్ సైజు ఫొటో ఇచ్చి హత్య చేసిన వారికి రూ.లక్ష నగదు సుపారీ ఇవ్వాలని సూచించింది. దాంతో జాన్సన్ తన స్నేహితులైన తాండూరు గ్రామానికి చెందిన చాకలి రాజు, చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన నవీన్​తో పాటు మరో 17 ఏళ్ల మైనర్ బాలుడిని హత్య చేయడానికి ఒప్పించాడు.

పథకం ప్రకారం సంపూర్ణ భర్త రవికి డబ్బు అప్పుగా ఇస్తామని ఆశ చూపిన జాన్సన్ అతడిని ఈనెల 24న పెద్దారెడ్డి గ్రామ డంప్ యార్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి రవి తలపై సుత్తితో బాదాడు. దీంతో రవి వారినుంచి తప్పించుకుని ఆత్మకూరు గేటు సమీపంలోని ఓ ఫామ్​ హౌస్ వైపు పారిపోయాడు.

జాన్సన్ అతడిని వెంబడించి మరోసారి దాడికి పాల్పడ్డాడు. అయినా తప్పించుకుని రవి ఫామ్​ హౌస్ లోపలికి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి హత్యకు కారణమైన భార్యతో సహా ప్రియుడు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన సుత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ముగ్గురు మొబైల్స్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.