అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apple | అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ చైనాలో కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి మార్కెట్‌లో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో, దాలియన్ నగరంలోని పార్క్‌ల్యాండ్ మాల్ స్టోర్‌ను (Parkland Mall Store) వచ్చే నెల ఆగస్టు 9న మూసివేయనున్నట్లు యాపిల్ అధికారికంగా ప్రకటించింది. యాపిల్ 15 ఏళ్ల క్రితమే చైనా మార్కెట్‌లోకి ప్రవేశించింది. అయితే ఇటీవల లోకల్ బ్రాండ్ల గిరాకీ పెరగడం, అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న టారిఫ్ వివాదాలు, యాపిల్ సేల్స్‌పై (Apple Sales) తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.
Apple | మూసివేత..
ప్రస్తుతం చైనాలో (China) యాపిల్‌కు 57 రిటైల్ స్టోర్లు ఉన్నప్పటికీ, ఇది ఆ కంపెనీ గ్లోబల్ రిటైల్ నెట్‌వర్క్‌లో కేవలం 10% మాత్రమే. అయినప్పటికీ, వరుసగా ఆరవ త్రైమాసికంలోనూ యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సంస్థ వార్షిక ఆదాయం 66 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు సమాచారం. అంతేకాదు, చైనాలో హువాయి, జియోమి, వీవో వంటి స్థానిక బ్రాండ్లు మరింత ప్రభావశాలిగా మారడం కూడా యాపిల్ మార్కెట్ షేర్‌కు ప్రధాన ఇబ్బంది అవుతోంది. టెక్నాలజీ పరిశోధనా సంస్థ కెనాలిస్ (Technology Research Firm Canalys) తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ ఐదో స్థానానికి పడిపోయింది.
ఈ పరిణామాల మధ్య యాపిల్ తీసుకున్న స్టోర్ మూసివేత నిర్ణయం కంపెనీ వ్యూహాల్లో మార్పునకు సంకేతంగా విశ్లేషించబడుతోంది. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. స్టోర్ మూసివేత వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు కల్పిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. యాపిల్ ప్రస్తుతం గ్రేటర్ చైనా అంతటా 57 దుకాణాలను నిర్వహిస్తోంది. వీటిలో ప్రధాన భూభాగం చైనా, హాంకాంగ్, మకావు మరియు తైవాన్ కూడా ఉన్నాయి. అయితే ఆగస్టు 16న షెన్‌జెన్‌లో కొత్త స్టోర్‌ను ప్రారంభించాలని కూడా యోచిస్తోంది.