Tsunami effect
Tsunami effect | సునామీ ఎఫెక్ట్​.. ఎగసి పడుతున్న అలలు.. భయంతో ప్రజల పరుగులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tsunami effect | పసిఫిక్ మహాసముద్రంలో సునామీ (Tsunami) బీభత్సం సృష్టిస్తోంది. రష్యాలో భారీ భూకంపంతో (Earthquake) సునామీ వచ్చింది. దీంతో సముద్రంలో అలలు 4 మీటర్ల వరకు ఎగసి పడుతున్నాయి. ఈ సునామీ ప్రభావం రష్యాతో (Russia) పాటు 30 దేశాలపై ఉండనున్నట్లు సమాచారం. అమెరికా తీరాలను సునామీ తాకింది. అమెరికాలోని అలాస్కా, హవాయి, వాషింగ్టన్‌, ఓరెగాన్, నార్త్ కాలిఫోర్నియా తీరాల్లో సునామీ తాకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రష్యాలోని కామ్చాట్కా దీవుల్లో 8.8 తీవ్రతతో బుధవారం భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో సునామీ వచ్చింది. ఇప్పటికే రష్యా, జపాన్ (Japan)​ తీర ప్రాంతాలను తాకిన సునామీ.. అమెరికాలోని పలు ప్రాంతాలను సైతం చేరింది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. జపాన్​ తీర ప్రాంతంలో 3 మీటర్ల మేర అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర సేవలకు టాస్క్‌ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. సునామీ ముప్పు ఉన్న దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది.

Tsunami effect | హవాయిలో సైరన్ల మోత

అమెరికాలోని పలు ప్రాంతాలను ఇప్పటికే సునామీ తాకింది. హవాయి (Hawai) ద్వీపం మొత్తానికి సునామీ ముప్పు పొంచి ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో సైరన్ల మోత మోగుతుంది. ప్రజలు భయంతో ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. కాగా.. జపాన్​ ప్రభుత్వం తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది. చైనాకు (China) సైతం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో షాంఘైలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tsunami effect | ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగలాలు

సునామీ ప్రభావంతో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. అలల దాటికి సముద్రంలోని తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. జపాన్​ తీర ప్రాంతంలో పలు తిమింగలాలు ఓడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ప్రజలు ఫొటోలు, వీడియోల కోసం సముద్ర తీరానికి వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Tsunami effect | భారత్​ అప్రమత్తం..

సునామీ నేపథ్యంలో భారత్​ (Bharat) అప్రమత్తం అయింది. ఆయా దేశాల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీర ప్రాంతాల్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. భారత కాన్సులేట్​ అధికారులు హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1-415-483-6629 ఏర్పాటు చేశారు.