అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది భక్తులు (Devotees) దర్శనం చేసుకుంటారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani Darshan Tickets) విషయంలో కీలక మార్పులు చేసింది.
Tirumala | కోటా పెంపు
ప్రస్తుతం శ్రీవాణి దర్శన కోటా కింద నిత్యం 1500 టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీటిని రెండు వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇక నుంచి కరెంట్ బుకింగ్ కోటా కింద తిరుమలలో రెండు వేల టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టికెట్లు ఇవ్వనున్నారు. కాగా.. తిరుమలలోని శ్రీవాణి ట్రస్ట్‌కు (Srivani Trust) విరాళం ఇచ్చే దాతలకు ఈ టికెట్లు ఇస్తారు. రూ.10 వేలు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే వారికి శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తారు. ఈ టికెట్లు ఉన్న భక్తులు క్యూలైన్లో వేచి ఉండకుండా వీఐపీ దర్శనం (VIP Darshanam) చేసుకునే అవకాశం ఉంటుంది.
Tirumala | దర్శనం వేళల్లో మార్పు
ప్రస్తుతం శ్రీవాణి దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు ఉదయం పూట స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. ఇక నుంచి సాయంత్రం కూడా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో తిరుమలలో గదులకు ఉన్న డిమాండ్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత విధానంతో శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల పాటు వసతి గదులు పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉదయం టికెట్ పొందిన భక్తులకు సాయంత్రం దర్శనం చేసేలా ఏర్పాట్లు చేశారు.
Tirumala | కొత్త కౌంటర్ల ప్రారంభం
భక్తుల రద్దీ మేరకు టీటీడీ తిరుమలలో సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఆయా దర్శన టికెట్ల కోసం ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. లడ్డూ ప్రసాదం కోసం కియోస్క్ మిషన్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం ఉన్న రద్దీ నేపథ్యంలో వారం క్రితం కొత్త కౌంటర్‌ను సైతం అధికారులు ప్రారంభించారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచి వేచి చూస్తుండడంతో.. రూ.60 లక్షల వ్యయంతో అన్నమయ్య భవనం (Annamayya Bhavan) ఎదురుగా శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌ను ప్రారంభించారు. తాజాగా టికెట్ల కోటా పెంచడంతో పాటు దర్శన సమయాల్లో సైతం అధికారులు మార్పులు చేశారు.