Ind vs Pak match
Ind vs Pak match | ఆసియా క‌ప్‌లో భార‌త్‌- పాక్ త‌ల‌ప‌డ‌తాయా..రోజు రోజుకి ఈ మ్యాచ్‌పై పెరుగుతున్న ఆగ్ర‌హ‌జ్వాల‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ind vs Pak match | సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియాకప్‌ టీ20 టోర్నీకి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేయడంతో టోర్నీపై నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ టోర్నమెంట్‌ను సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు తటస్థ వేదిక అయిన దుబాయ్‌లో (Dubai) నిర్వహించనున్నారు. అయితే భారత్ – పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండడంతో సెప్టెంబర్ 14న వీరి మధ్య హైవోల్టేజ్‌ క్లాష్‌ జరగనుంది. కాక‌పోతే జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్‌తో (Pakistan) మ్యాచ్ ఆడడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఇలాంటి దాడుల తర్వాత ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ అవసరమా?” అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.

Ind vs Pak match | అంతా సస్పెన్స్..

దాడుల కారణంగా తమ వారిని కోల్పోయిన వారు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎలా చూడగలరు. ఈ మ్యాచ్‌ను మ‌నం బహిష్కరించాలి. ప్రసారం చేసేవారికి ఒక్క రూపాయి కూడా వెళ్లకుండా చేయాల‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. భారత్-పాకిస్తాన్ (India – Pakistan) మ్యాచ్ గురించి పార్లమెంటులో ఎవరూ మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని మ‌రో నెటిజ‌న్ అన్నాడు. అసదుద్దీన్ ఒవైసీ (లోక్‌సభ సభ్యుడు) ఒక్క‌డు మాత్రమే దీని గురించి మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి స్పంద‌న‌ రాలేదు. టోస్ట్ రెండు వైపులా వెన్న రాసినట్లు ఉందంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికీ జాతీయ క్రీడా బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల BCCI నేరుగా క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని, కానీ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బోర్డు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మ్యాచ్‌ను బహిష్కరిస్తే భారత్‌కే పాయింట్ల విషయంలో నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది ద్వైపాక్షిక సిరీస్‌ కాదు, టోర్నమెంట్‌(Tournament)లో భాగమై జరుగుతున్న మ్యాచ్ కావడంతో వాకోవర్ వల్ల పాకిస్తాన్‌కు లాభం, భారత్‌కు నష్టం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ – పాక్ మ్యాచ్ జరిగితే బ్రాడ్‌కాస్టర్లకు భారీ ఆదాయం చేకూరుతుందని, మ్యాచ్ రద్దయితే ఇది కేవలం ప్రసార సంస్థలకే కాదు, ఏసీసీకి చెందిన ఇతర సభ్యదేశాలకు కూడా ఆర్థికంగా నష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ – పాక్ మ్యాచ్ జరగాలా లేదా? అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.