అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Updates | రాష్ట్రంలో రెండు రోజులపాటు వానలు తెరిపినిచ్చాయి. వరుసుగా నాలుగైదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, జలాశయాల్లోకి నీరు చేరింది. చాలా గ్రామాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల చెరువులు అలుగు పారాయి. చిన్న తరహా ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. అయితే రెండు రోజుల పాటు వరుణుడు శాంతించాడు. దీంతో సోమ, మంగళవారాల్లో వర్షాలు పడలేదు. అయితే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం పూట వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపటి నుంచి వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Weather Updates | నదులకు భారీ వరద
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి (Godavari), కృష్ణ (Krishna) నదులకు భారీగా వరద వస్తోంది. కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ నదిపై గల అన్ని ప్రాజెక్ట్‌లు నిండాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండుకుండల్లా మారడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో ఏపీలో గల పులిచింతల ప్రాజెక్ట్‌కు కూడా భారీగా వరద వస్తోంది. దీంతో ఆ ప్రాజెక్ట్ కూడా నిండనుంది.
తెలంగాణలో ఎగువన గోదావరి వరద ఎక్కువగా లేదు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తోంది. స్థానికంగా కురిసిన వర్షాలతో మంగళవారం లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. బుధవారానికి అది 15 వేలకు తగ్గిపోయింది. అయితే కాళేశ్వరం దిగువన మాత్రం గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. మరోవైపు మంజీర నదికి మాత్రం ఈ సీజన్లో ఇంత వరకు భారీ వరదలు రాలేదు. దీంతో ఆ నదిపై గల సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్ట్‌లు వెలవెలబోతున్నాయి.