Donald Trump
Donald Trump | వాణిజ్య ఒప్పందంపై ప్ర‌తిష్టంభ‌న‌.. 25 శాతం టాక్స్ విధిస్తామ‌న్న‌ ట్రంప్‌

అక్షరటుడేర, వెబ్​డెస్క్: Donald Trump | వాణిజ్య ఒప్పందంపై అమెరికా, ఇండియా మ‌ధ్య ప్ర‌తిష్టంభన నెల‌కొంది. ఇరు దేశాల మ‌ధ్య ఇంకా ఒప్పందం ఖ‌రారు కాలేద‌ని అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వెల్ల‌డించారు. సుంకాల విధింపు నిర్ణ‌యం వాయిదాకు ఆగ‌స్టు 1తో గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో భార‌త్‌పై టారిఫ్ పెంచ‌క త‌ప్ప‌ద‌న్నారు.

ఇండియా(India)తో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని ట్రంప్ తెలిపారు. రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు చాలా బాగా జరుగుతున్నాయన్న ఆయ‌న‌.. న్యూఢిల్లీపై 20 శాతం నుండి 25 శాతం సుంకం విధించే అవకాశం ఉందని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా అమెరికాపై అధిక సుంకాలను (High Tariffs) విధిస్తోందన్న ట్రంప్‌.. ఇప్పుడు తాను అధ్య‌క్ష బాధ్యతలో ఉన్నందున అధిక సుంకాలు ముగిసిపోతాయ‌న్నారు.

Donald Trump | యుద్ధాన్ని నేనే ఆపాను..

భార‌త్‌-పాక్ మ‌ధ్య యుద్ధాన్ని తానే ఆపాన‌ని ట్రంప్ మ‌రోసారి చెప్పుకొచ్చారు. త‌న అభ్య‌ర్థ‌న మేర‌కే ఇండియా దాడులు ఆపింద‌న్నారు. భారతదేశంపై 20-25 శాతం అధిక సుంకాలు విధిస్తారా? అని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న అవున‌ని స‌మాధాన‌మిచ్చారు. “ఇండియా మా మిత్ర దేశం. నా అభ్యర్థన మేరకు వారు పాకిస్తాన్‌తో (Pakistan) యుద్ధాన్ని ముగించారు. అయితే, భారతదేశంతో ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఇండియాతో మంచి సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ, ఇతర దేశాల‌తో పోలిస్తే మా నుంచి ఎక్కువ సుంకాలను వసూలు చేసిందని” తెలిపారు. అయితే, ట్రంప్ అనేక ఇతర దేశాలకు చేసినట్లుగా, న్యూఢిల్లీపై (New Delhi) విధించిన సుంకాన్ని ప్రకటిస్తూ భారతదేశానికి ఎటువంటి లేఖలు పంపలేదు.

Donald Trump | మ‌ధ్యంత‌ర ఒప్పందం క‌ష్ట‌మే..

గ‌తంలో ట్రంప్ ఇండియా స‌హా వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌ల పెంపు వాయిదా ఆగస్టు 1తో ముగియ‌నుంది. ఈ గ‌డువు రెండు రోజుల్లో ముగియ‌నుండ‌గా, తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, కొలిక్కి రాలేదు. మ‌ధ్యంత‌ర ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా కొలిక్కి రాలేదు. ఎటువంటి నిర్దిష్ట పరిణామాలు లేదా అధికారిక ప్రకటనలు వెలువ‌డ‌క పోవడంతో గడువుకు ముందు మధ్యంతర వాణిజ్య ఒప్పందం(Trade Agreement) ఖరారయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.