Farmers
Farmers | ‘బోనస్’​ కోసం రైతుల నిరీక్షణ

అక్షరటుడే, ఇందల్వాయి : Farmers | వానాకాలం నాట్లు పూర్తయ్యాయి. అయినా కూడా యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం ఇంకా బోనస్​ డబ్బులు చెల్లించలేదు. తాము అధికారంలోకి వస్తే ధాన్యానికి క్వింటాల్​కు రూ.500 బోనస్​ ఇస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టాక సన్నాలకు బోనస్​ ఇస్తామని తెలిపింది. ఈ మేరకు గత వానాకాలం సీజన్లో (monsoon season) రైతులకు బోనస్​ చెల్లించారు. దీంతో యాసంగిలో జిల్లావ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తం సన్నరకం ధాన్యం సాగు చేశారు. అయితే కొనుగోళ్లు పూర్తయి రెండు నెలలు కావొస్తున్న అన్నదాతల ఖాతాల్లో బోనస్​ డబ్బులు జమ కాలేదు.

జిల్లాలో యసంగిలో 606 ధాన్యం కొనుగోలు కేంద్రాలు (paddy purchase centers) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 8.40 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం రూ.1949.09 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 7,38,662 మెట్రిక్‌ టన్నులు సన్నరకం కాగా, 1,01, 481 మెట్రిక్‌ టన్నులు మాత్రమే దొడ్డు రకం. ఈ లెక్కన బోనస్​ కింద జిల్లాకు రూ.369 కోట్లు రావాల్సి ఉంది.

Farmers | బోనస్​పై ఆశతో..

జిల్లాలో గతేడాది యాసంగిలో 4.28 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ఈ యాసంగిలో (Yasangi Season) ఏకంగా 8.40 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. అంటే గతేడాది పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేశారు. దీనికి కారణం ప్రభుత్వం సన్న రకాలకు బోనస్​ డబ్బులు చెల్లిస్తామని చెప్పడం. వానాకాలం సీజన్​లో బోనస్​ చెల్లించడంతో రైతులు యాసంగిలో ఎక్కువ ఎక్కువ శాతం సన్నాలను సాగు చేశారు. గతంలో బయట మార్కెట్​లో కొందరు రైతులు ధాన్యం విక్రయించేవారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే బోనస్​ వస్తుందని ఈ సారి మొత్తం ప్రభుత్వానికి అమ్మారు. దీంతో అధికారులు రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టారు. అయితే ప్రభుత్వం బోనస్​ చెల్లించకపోవడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.

Farmers | సన్నాల సాగుకు శ్రమ అధికం

దొడ్డు రకం ధాన్యంతో పోలిస్తే సన్న రకం సాగు చేయడానికి కాస్త శ్రమ, పెట్టుబడి అధికంగా ఉంటుంది. సన్నాలకు ఎక్కువగా తెగుళ్లు వస్తాయి. దీంతో పురుగు మందులకు ఖర్చు చేయాలి. అలాగే దిగుబడి కూడా కొంచెం తక్కువగా వస్తుంది. అయినా బోనస్​ ఇస్తే లాభం వస్తుందని రైతులు జిల్లాలో సన్నాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్​లో (rainy season) సైతం ఎక్కువ విస్తీర్ణంలో సన్నాలనే సాగు చేశారు. అయితే యాసంగిలో విక్రయించిన సన్న రకం ధాన్యానికి ఇప్పటికి బోనస్​ చెల్లించకపోవడం.. ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బోనస్​ డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Farmers | రూ.65 వేలు రావాలి

– కనుగొందుల భూమయ్య, రైతు, చంద్రాయన్​పల్లి

ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లిస్తే వానాకాలం పెట్టుబడికి సహాయంగా ఉంటుంది. యాసంగి సీజన్​లో కొనుగోలు కేంద్రంలో 130 క్వింటాళ్ల సన్న వడ్లు అమ్మాను. బోనస్​ కింద రూ.65 వేలు రావాల్సి ఉంది.

Farmers | 9 ఎకరాల్లో సాగు చేశా

– లాల్ సింగ్, సామ్యా నాయక్ తండా

ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే ఆశతో యాసంగిలో 9 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశా. పంటలకు రోగాలు రావడంతో మందుల పిచికారికి అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో పాటు సన్న రకం పంటకు శ్రమ అధికంగా ఉంటుంది. బోనస్ జమ చేస్తే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. లేదంటే రైతులు నష్టపోతారు.