CM Revanth Reddy
CM Revanth Reddy | భూవివాదంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట.. పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | భూవివాదం కేసులో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court) భారీ ఊరట లభించింది. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పిటిషిన్‌ను సాక్ష్యాలు లేనందున కొట్టివేస్తూ సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం తీర్పు వెలురించింది. అలాగే, హైకోర్టు జ‌డ్జిపై (High Court judge) అభ్యంత‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని పిటిష‌న‌ర్​పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కోర్టు ధిక్కార చ‌ర్య‌లు చేప్టాల‌ని ఆదేశించింది.

సొసైటీ స్థ‌లాన్ని ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నించార‌ని రేవంత్‌రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు కొండ‌ల్‌రెడ్డి, ల‌క్ష్మ‌య్య‌పై ఎన్.పెద్దిరాజు 2016లో గ‌చ్చిబౌలి పోలీసుస్టేష‌న్‌లో (Gachibowli police station) ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ హైకోర్టు కేసు కొట్టేసింది. అయితే హైకోర్టు ఆదేశాలపై ఎన్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాల్​ వేశారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిష‌న్‌ను చీఫ్ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ (Chief Justice BR Gavai) నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

CM Revanth Reddy | పిటిష‌న‌ర్‌పై తీవ్ర ఆగ్ర‌హం..

పిటిష‌న‌ర్‌తో పాటు ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదిపై సీజేఐ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెద్దిరాజు దాఖ‌లు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తీర్పునకు సంబంధింన అంశాలతో పాటు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయ‌డంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు న్యాయ‌వాదితో పాటు పిటిష‌న‌ర్‌కు కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసు జారీ చేసింది. ఒక న్యాయ‌వాదిగా న్యాయ‌మూర్తిపై వ్యాఖ్య‌లు చేస్తూ పిటిష‌న్ ఎలా దాఖ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించింది. అయితే, న్యాయ‌వాది రితీశ్ పాటిల్ (lawyer Ritish Patil) క్ష‌మాప‌ణ చెప్ప‌గా, అందుకు నిరాకరించిన న్యాయ‌స్థానం పిటిష‌న్ రాసేట‌ప్పుడు, దాఖ‌లు చేసేట‌ప్పుడు ఎలా గుడ్డిగా దాఖ‌లు చేశార‌ని ప్ర‌శ్నించింది.

కేసు విత్‌డ్రా (case withdraw) చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ సీజేఐ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీస్‌పై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే.. కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు. పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ బీఆర్ గవాయి (CJI BR Gavai) తదుపరి విచారణకు పిటిషనర్ అండ్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.