
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Home Minister Amit Shah | జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు పహల్గామ్‌లో దాడికి పాల్పడిన వారేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ మహాదేవ్లో మట్టుబెట్టారని తెలిపారు.
ఈ మేరకు ఆయన మంగళవారం లోక్‌సభలో ఓ ప్రకటన చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే.. సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం వారిలో కనిపించలేదని చెప్పారు. విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదులను మట్టుబెడితే ఆనందం వ్యక్తం చేస్తారనుకున్నానని.. కానీ విపక్ష సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి ఆలోచించాలంటూ హితవుపలికారు.
Home Minister Amit Shah | పాక్‌కు క్లీన్ చిట్ ఇస్తారా?
కాంగ్రెస్ పార్టీపై (Congress Party) హోం మంత్రి ధ్వజమెత్తారు. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలు ఉన్నాయా ? అన్న చిదంబరం ప్రశ్నపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. పాక్‌కు క్లీన్‌చిట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ నిలదీశారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని హితవుపలికారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి కొన్ని పాక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
Home Minister Amit Shah | అతడు పాక్ కమాండరే..
భద్రతా బలగాలు కాల్చి చంపిన సులేమాన్ లష్కరే తోయిబాకు A- కేటగిరీ కమాండర్ అని అమిత్ షా వెల్లడించారు. ఆఫ్ఘన్ A- కేటగిరీ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాది అని, జిబ్రాన్ కూడా A- గ్రేడ్ ఉగ్రవాది అని తెలిపారు. బైసారన్ లోయలో మన పౌరులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించామన్నారు. పహల్గామ్‌లో మతాన్ని అడుగుతూ అమాయక పౌరులను వారి కుటుంబాల ముందే కాల్చి చంపారని అమిత్ షా అన్నారు. “ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని చెప్పారు. సోమవారం నాటి ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్ మరణించారని, వారికి ఆహారం సరఫరా చేసే వ్యక్తులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారని అమిత్ షా తెలిపారు.
Home Minister Amit Shah | తగిన బుద్ధి చెప్పాం..
పహల్గామ్ దాడి (Pahalgam attack) తర్వాత, బాధిత కుటుంబాలను కలిశానని అమిత్ షా లోక్‌సభలో వివరించారు. “పెళ్లి అయిన 6 రోజులకే వితంతువు అయిన ఒక మహిళ నా ముందు నిలబడి ఉండడం నేను చూశాను. ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఉగ్రవాదులను పంపిన వారిని మోదీజీ తటస్థీకరించారు. నాడు ఉగ్రదాడికి పాల్పడిన వారిని నేడు మన భద్రతా దళాలు చంపాయని నేను ఈ రోజు అన్ని కుటుంబాలకు చెప్పాలనుకుంటున్నాను” అని తెలిపారు. ఉగ్రవాదులను పంపిన వారిని ఆపరేషన్ సిందూర్ నిర్వీర్యం చేసిందని, మారణ హోమం సృష్టించిన వారిని ఆపరేషన్ మహాదేవ్ చంపేసిందన్నారు.