Rahul Gandhi
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కీల‌క నిర్ణయం.. 22 మంది చిన్నారుల ద‌త్త‌త‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi | కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పాకిస్తాన్ కాల్పుల్లో మ‌ర‌ణించిన వారి పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ప‌హల్గామ్ దాడి (Pahalgam attack) త‌ర్వాత భార‌త్ పాకిస్తాన్‌లోని ఉగ్ర‌వాద శిబిరాల‌ను ధ్వంసం చేసింది. దీంతో పాక్ భార‌త్‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో చాలా మంది పౌరులు మృతి చెందారు. వారి పిల్ల‌లు అనాథ‌లుగా మారారు. ఈ క్ర‌మంలో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని రాహుల్ నిర్ణయించారు.

Rahul Gandhi | రాహుల్ చెంత‌కు జాబితా

రాహుల్ గాంధీ పిల్ల‌ల‌ను ద‌త్త‌త‌కు తీసుకుంటున్న విష‌యాన్ని జ‌మ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా వెల్ల‌డించారు. బాధితుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన స‌మ‌యంలోనే ఆయ‌న పిల్ల‌ల జాబితా అడిగార‌ని చెప్పారు. “మే 7 మరియు 10 మధ్య పాకిస్తాన్ కాల్పుల్లో పూంచ్, రాజౌరిలో చాలా మంది పౌరులు మరణించారు. ఆస్తులకు నష్టం జరిగింది. విధ్వంసకర కాల్పుల తర్వాత రాహుల్ గాంధీ పూంచ్‌ను సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారిని, అందులో ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయం చేసే వారి పిల్ల‌ల పేర్ల‌తో జాబితా త‌యారు చేసి ఇవ్వాల‌ని కోరారు. తదనుగుణంగా మేము ఆ జాబితాను ఆయనకు సమర్పించామని” చెప్పారు. పూంచ్ జిల్లాలోనే (Poonch district) పార్టీ వద్ద అలాంటి 22 మంది పిల్లల జాబితా ఉందని, ఆ సంఖ్య మ‌రింత పెరుగ‌వ‌చ్చ‌న్నారు.