అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. కత్తులు, తల్వార్లతో హల్చల్ చేశారు. నగరంలో కొంతకాలంగా రౌడీ షీటర్ల కదలికలు అంతగా లేవు. సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) బాధ్యతలు స్వీకరించిన తర్వాత కఠిన చర్యలు చేపట్టడంతో గతంలో ఉన్న గ్యాంగులు సైలంట్ అయిపోయాయి. అయితే తాజాగా నగరంలోని ఆటోనగర్‌లో (Auto Nagar) రౌడీ షీటర్ ఆరిఫ్ గ్యాంగ్ సభ్యులు హల్ చల్ చేశారు.
Nizamabad City | బర్త్‌డే వేడుకల్లో..
ఆటోనగర్‌లో సోమవారం రాత్రి అఫు అనే వ్యక్తి బర్త్ డే వేడుకల్లో (birthday celebrations) ఆరిఫ్ గ్యాంగ్ హల్చల్ చేసింది. నడిరోడ్డుపై తల్వార్లు, కత్తులతో యువకులు హంగామా చేశారు. నగరంలో ఒకప్పుడు జంగిల్ ఇబ్బు, ఆరిఫ్ డాన్లు వేరువేరుగా గ్యాంగ్‌లు మెయింటెన్ చేసేవారు. నగరంలో జరిగిన ఓ పార్టీలో జంగిల్ ఇబ్బును ఆరిఫ్ గ్యాంగ్ హతమార్చింది. అనంతరం జైలుకు వెళ్లి వచ్చిన ఆరిఫ్ డాన్‌ను జంగిల్ ఇబ్బు గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి హత్య తర్వాత రెండు గ్యాంగ్‌లు సైలెంట్ అయిపోయాయి.
మరోవైపు సీపీ సాయిచైతన్య జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దుకాణాలు తెరిచినా వారిపై సైతం చర్యలు చేపడుతున్నారు. రాత్రిపూట గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో నగరంలో కొంతకాలంగా రౌడీ షీటర్ల కదలికలు తగ్గిపోయాయి. అయితే సోమవారం రాత్రి పుట్టిన రోజు వేడుకల పేరిట ఆరిఫ్ గ్యాంగ్ కత్తులు, తల్వార్లతో బైక్‌పై ర్యాలీ తీయడం గమనార్హం. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.