Shristi Clinic
Shristi Clinic | పేద దంపతుల నుంచి బిడ్డ కొనుగోలు.. యాచకుల నుంచి స్పెర్మ్​ సేకరణ.. వెలుగులోకి ‘సృష్టి’ మోసాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shristi Clinic | సృష్టి టెస్ట్​ ట్యూబ్ సెంటర్​ (Shristi Test Tube Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లయి ఏడేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఓ జంట ఈ సెంటర్​ను ఆశ్రయించగా.. సరోగసి (Surrogacy) పేరిట వేరే వారికి పుట్టిన బిడ్డను అప్పగించిన విషయం తెలిసిందే. దంపతుల నుంచి రూ.40 లక్షల వసూలు చేసిన డాక్టర్​ నమ్రత.. రూ.90 వేలకు బిడ్డను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్లు చెప్పి దంపతులకు అప్పగించింది. ఈ మేరకు దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్ట్​ చేశారు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Shristi Clinic | ఏజెంట్ల ద్వారా బిడ్డల కొనుగోలు

పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్ (IVF)​ కోసం సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ను ఆశ్రయించేవారు. అయితే డాక్టర్​ నమ్రత (Doctor Namratha) వారికి ఐవీఎఫ్ కంటే సరోగసి బెటర్​ అని చెప్పేది. ఆమెకు విజయవాడ, విశాఖపట్నంలో కూడా సెంటర్లు ఉన్నాయి. ఆయా సెంటర్లకు పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి సరోగసితోనే బిడ్డలు పుడతారని చెప్పేది. అనంతరం వారి స్థోమతను బట్టి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసేది. అయితే సరోగసి ద్వారా కాకుండా శిశువులను కొనుగోలు చేసి వారికి అప్పగించేది. సరోగసి ద్వారా పుట్టారని నమ్మించేది. ఈ మేరకు నకిలీ పత్రాలు, డీఎన్​ఏ రిపోర్టులు కూడా తయారు చేసేది.

శిశువుల కొనుగోలు కోసం డాక్టర్​ నమ్రత ఏజెంట్లను నియమించుకుంది. పేద దంపతుల దగ్గరకు వెళ్లి వీరు బేరం కుదుర్చుకునేవారు. రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించి బిడ్డలను కొనుగోలు చేసేవారు. ఆ బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టినట్లు నమ్మించి ఆమె దగ్గరకు చికిత్సకు వచ్చిన వారికి అందించేది. ఆ క్లినిక్​లో ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Shristi Clinic | బీరు, బిర్యానీ ఇచ్చి..

సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ నిర్వాహకులు ఐవీఎఫ్​ చికిత్స కూడా చేసేవారు. అయితే వీరు సికింద్రాబాద్ (Secunderabad) చుట్టుపక్కల ఉండే బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు తెలిసింది. పిల్లల కోసం వచ్చే దంపతులకు ఆ వీర్యంతో ఐవీఎఫ్​ చేసినట్లు సమాచారం. సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని ఎథిక్స్‌ కమిటీ విచారణ ప్రారంభించింది.