అక్షరటుడే, వెబ్డెస్క్ : Transport Department | రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. రవాణా శాఖలో ఫీజులను భారీగా పెంచింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ప్రజలపై భారం మోపింది. డ్రైవింగ్ లెసెన్స్ (Driving license), వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ సర్టిఫికెట్ల ఛార్జీలను భారీగా పెంచుతూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఛార్జీలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.
రాష్ట్రంలో వాహనాల కొనుగోలుపై గతంలో ద్విచక్రవాహనాలకు ఛార్జీలు రూ.200 ఉండేవి. ప్రస్తుతం దానిని వాహన విలువలో 0.5శాతానికి పెంచారు. గతంలో అన్ని ద్విచక్రవాహనాలకు రూ.200 వసూలు చేసేవారు. దీంతో రూ.లక్ష విలువైన బైక్కు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కార్లకు గతంలో రూ.400 ఛార్జీలు వసూలు చేసేవారు. దీనిని ప్రస్తుతం వాహన విలువలో 0.1శాతంగా నిర్ణయించారు. దీంతో రూ.ఐదు లక్షల కారుకు రూ.500 ఛార్జీ కట్టాల్సి ఉంటుంది.
Transport Department | లైసెన్స్ ఫీజులు సైతం
లైర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఫీజులను సైతం ప్రభుత్వం పెంచింది. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్ ఫీజు గతంలో రూ.335 ఉండగా.. ప్రస్తుతం రూ.440కి పెంచారు. బైక్, కారు లెర్నర్ లైసెన్స్ ఫీజు రూ. 450 నుంచి రూ. 585కి పెరిగింది. డ్రైవింగ్ టెస్ట్ (Driving Test) మొత్తం ఫీజు గతంలో రూ.1,035 నుంచి రూ.1,135కి పెంచారు. వాహనాల ఫిట్నెట్ టెస్ట్ (Fitness Test) ఫీజు సైతం రూ.700 నుంచి రూ.800 పెంచడం గమనార్హం.
Transport Department | హైపోథికేషన్ తొలగింపు ఛార్జీలు..
చాలా మంది వాహనాలను ఈఎంఐ విధానంలో కొనుగోలు చేస్తారు. ఈఎంఐలు చెల్లించిన తర్వాత ఆ వాహనంపై హక్కులను రుణం ఇచ్చిన బ్యాంకు నుంచి వాహనదారుడికి బదిలీ చేస్తారు. దీనిని హైపోథికేషన్ తొలగింపు అంటారు. ఈ ఛార్జీలు గతంలో రూ. 650 ఉండగా ప్రస్తుతం రూ.1900కు పెంచారు. అలాగే వాహనాలను ఇతరులకు విక్రయిస్తే యాజమాన్య బదిలీ కోసం రూ. 935 ఉన్న రుసుమును రూ.1805 కు పెంచారు.
Transport Department | వాహనదారులపై భారం
ప్రభుత్వం రేట్లు పెంచడంతో వాహనదారులపై భారం పడనుంది. ఇప్పటికే వాహనాల రేట్లు భారీగా పెరిగాయి. ఇన్సూరెన్స్ (Insurance) రేట్లు సైతం ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ధరలు పెంచడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే రోడ్ టాక్స్, క్వార్టర్లీ టాక్స్ మాత్రం పెంచలేదని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని కొన్ని రోజులుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికే మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా.. రవాణా శాఖలో పలు ఛార్జీలను సవరించింది.