అక్షరటుడే, భీమ్గల్: cyber crime : సైబర్ మోసాల కట్టడికి సర్కారు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు ఆగడం లేదు. రోజుకో మోసం వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా అమెజాన్ డెలివరీ హబ్ పేరిట ఘరానా మోసానికి తెరలేపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అమెజాన్ డెలివరీ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పి రూ. 1,71,690 చేసి మోసం చేసిన ఘటన బాల్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ పరిసర ప్రాంతాల్లో అమెజాన్ డెలివరీ హబ్ ఏర్పాటు చేస్తామని అందుకు నమోదు చేసుకోవాలని బాల్కొండకు చెందిన మాలెం సత్యసాగర్ కు ఫొన్ చేసి నమ్మించాడు. దీంతో అపరిచిత వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి.. నమోదు కోసం ఫోన్ పే ద్వారా 17,700, ఒప్పందం కోసం అని చెప్పి 28,972, మెటీరియల్ ఇతరత్రా సామాగ్రి కోసం పలు దఫాలుగా బాధితుడు డబ్బులు పంపించాడు. ఇలా మొత్తం రూ.1,71,690 డబ్బులు వేశాడు. తీరా తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శైలందర్ తెలిపారు.