అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అనుమానాస్పద స్థితిలో అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. దోమకొండ (Domakonda)నరసింగరాయ కుంటలో సోమవారం (జులై 28) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై స్రవంతి కథనం ప్రకారం..
మెదక్ జిల్లాకు చెందిన పెద్దరాగుల శివాని(23), చిన్న రాగుల మల్లవ్వ(19) కుటుంబ సభ్యులతో కలిసి దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా, సోమవారం కళాశాల పక్కనే ఉన్న నరసింగరాయ కుంటలో శివాని, మల్లవ్వ విగత జీవులుగా కనిపించారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దుస్తులు ఉతకడానికి వెళ్లి కాలుజారి నీటిలో పడిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.