Womens Chess World Cup final
Womens Chess World Cup final | కోనేరు హంపీని ఓడించి క‌న్నీళ్లు పెట్టుకున్న దివ్య దేశ్‌ముఖ్.. తొలి భారత మహిళగా రికార్డ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Womens Chess World Cup final | భారత యువ గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ (divya deshmukh 2025) ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ రోజు జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అనుభవజ్ఞురాలైన కోనేరు హంపీపై (Koneru Humpy) రాపిడ్ టైబ్రేకర్‌లో విజయం సాధించింది.

మొద‌ట్లో రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియడంతో విజేత కోసం నిర్ణయాత్మక రాపిడ్ మ్యాచ్‌లు నిర్వహించారు. మొదటి గేమ్‌ సమంగా ముగియగా, రెండో గేమ్‌లో హంపీ చేసిన చిన్న పొరపాటును దివ్య చాకచక్యంగా ఉపయోగించుకొని గేమ్‌ను 75 ఎత్తుల్లో ముగించింది. విజయం అనంతరం దివ్య‌ సంతోషంతో తల్లిని కౌగలించుకుని క‌న్నీళ్లు పెట్టుకుంది.

Womens Chess World Cup final | స‌రికొత్త చ‌రిత్ర‌..

కేవలం 19 ఏళ్ల వ‌య‌స్సులో దివ్య ఈ టైటిల్‌ను గెలుచుకోవడం గొప్ప విష‌యం. ఇక ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ స్టార్‌గా (first Indian female chess star) కూడా దివ్య నిలిచింది. గత సంవత్సరం, దివ్య జూనియర్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను దక్కించుకుంది. ఇప్పుడు మహిళల ఫిడే ప్రపంచకప్‌ను (Women’s FIDE World Cup) గెలిచిన తొలి భారతీయురాలిగా దివ్య అరుదైన గౌరవం అందుకుంది. ఈ విజయం ద్వారా దివ్య దేశ్‌ముఖ్ $50,000 (సుమారు రూ. 41 లక్షలు) ప్రైజ్ మనీ (Prize Money) గెలుచుకుంది. ఇప్పటికే 2020 ఫిడే ఆన్‌లైన్ ఒలింపియాడ్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆమె, 2021లో 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందింది. తాజా విజయం ఆమె కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

దివ్య దేశ్‌ముఖ్ విజయంతో (Divya Deshmukh victory) భారత చెస్‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆమె ప్రదర్శించిన అంకితభావం, నైపుణ్యం, పోటీపై పట్టుదల యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ సీనియర్ విభాగంలో కొన్ని టోర్నీలు మాత్రమే ఆడింది. కోనేరు హంపితో (Koneru Hampi) పోల్చుకుంటే దివ్య అనుభవం చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ టోర్నీకి ముందు దివ్య దేశ్‌ముఖ్‌కు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా లేదు. అయితే 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన దివ్య.. 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స‌త్తా చాటింది. అంతేకాక ఒలింపియాడ్‌లో మూడు స్వర్ణ పతకాలను ద‌క్కించుకుంది. తాజా ప్రపంచకప్‌లో తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారిక, జు జినర్ వంటి ప్రతిభావంతులను సైతం ఓడించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.