అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు భారీగా నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, నాలాలు రక్షించడంతో పాటు ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలను తొలగించడానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా నగరంలో అనేక అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. పలు చెరువులన పునరుద్ధరించింది. నాలాలపై నిర్మించిన భవనాలను కూల్చివేసి వర్షాకాలంలో వరద ముంపును తగ్గించింది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా హైడ్రాకు రూ.25 కోట్ల నిధులు విడుదల చేసింది.
హైడ్రాకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.25 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి (Govt Secretery Ilambarti) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు తొలగించడం, చెరువులు, కుంటల రక్షణ కోసం ఈ నిధులను వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే విపత్తు నిర్వహణ కోసం సైతం వీటిని వినియోగించుకునే అవకాశం కల్పించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్షాకాలం నేపథ్యంలో వరద ముంపు నియంత్రణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పలు నాలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై సైతం తక్షణం స్పందిస్తున్నారు. నాలాల్లో పూడిక తీతతో పాటు ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో నిధులు విడుదల చేయడంతో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వేగం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.