అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Ex Mla Jeevan Reddy | ‘ఇందూరు పంతం.. ఇందిరమ్మ పాలన రాజ్యం అంతం’ నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో.. కాంగ్రెస్ జీరో అవుతుందని జోస్యం చెప్పారు.
Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్.. బీఆర్ఎస్ క్లీన్ స్వీప్..
రేవంత్ సర్కార్ (CM Revanth Reddy) మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అట్టర్‌ప్లాప్‌గా నిలిచిందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అన్ని గ్రామాలు నినదిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసి పోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు.
Ex Mla Jeevan Reddy | పల్లెల్లో పారిశుధ్యం అటకెక్కింది..
పల్లెల్లో కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం అటకెక్కిందని జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని, రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పల్లెలన్నీ సస్యశ్యామలంగా ఉండేవన్నారు.
Ex Mla Jeevan Reddy | ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పాతరేసింది..
కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరని ఆయన ఎద్దేవా చేశారు. పేదలకు రూ.4,000 పెన్షన్ రావడం లేదని, ఆడబిడ్డలకు రూ.2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకం అమలు కావడం లేదని విమర్శించారు. అన్నదాతలకు రుణమాఫీ కాలేదని, రైతన్నలకు రూ.15,000 రైతుభరోసా ఎగ్గొట్టారని, మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా రావడం లేదని, పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వడం లేదన్నారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వలేదని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందని ద్రాక్షగా మారాయని వ్యాఖ్యానించారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ గోడకు వేళాడుతోందని.. రూ.4,000 నిరుద్యోగ భృతి గంగలో కలిసిందని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Ex Mla Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యంలో అంతా అవినీతే..
ఇందిరమ్మ రాజ్యంలో అంతా అవినితి రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగం కాగా, రేవంత్ పాలన రాతి యుగాన్ని తెచ్చిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హామీ ఇవ్వక పోయినా 13లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు రూ.11,000 కోట్లు ఖర్చుపెట్టి కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్‌దని ఆయన స్పష్టం చేశారు.
Ex Mla Jeevan Reddy | జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం..
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే ప్రారంభిస్తామని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను (KCR) మూడోసారి సీఎంను చేసేవరకూ నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీకెక్కుతామన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ అని, కాంగ్రెస్, బీజేపీలు ప్రేతాత్మలని విమర్శించారు.
Ex Mla Jeevan Reddy | త్వరలో జిల్లాలో పర్యటన
త్వరలోనే జిల్లావ్యాప్తంగా పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఆపదకాలంలోనూ పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం వద్దు కేసీఆర్ రాజ్యం ముద్దు అన్నది తెలంగాణ ప్రజల నినాదంగా ముందుకు పోతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, మాస్త ప్రభాకర్, నక్కల భూమేష్, పూజ నరేందర్, మెట్టు సంతోష్, రజనీష్, వెల్మల్ సురేష్, సుంకరి రవి, రంజిత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.