Fake Apple products
Fake Apple products | నకిలీ యాపిల్​ ఉత్పత్తుల స్కాం.. రూ.3 కోట్ల విలువైన యాక్సెసరీస్​ స్వాధీనం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Apple products | మార్కెట్​లో యాపిల్ (Apple)​ సంస్థకు ఉన్న క్రేజ్​ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్​ బ్రాండ్ సామగ్రి కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ధర ఎంతయినా ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. అయితే యాపిల్​ యాక్సెసరీస్​కు మార్కెట్​లో ఉన్న డిమాండ్​ను కొందరు క్యాష్​ చేసుకుంటున్నారు. నకిలీ యాపిల్​ ప్రోడక్ట్స్​ తయారు చేసి విక్రయిస్తున్నారు.

హైదరాబాద్​లోని (Hyderabad) మీర్​చౌక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్​ యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇర్ఫాన్ అలీ, షాహిద్ అలీ, సంతోష్ రాజ్‌ పురోహిత్​లను అరెస్ట్​ చేశారు. వీరు ముంబైలోని ఏజెంట్ల నుంచి నకిలీ యాపిల్​ సామగ్రి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.

Fake Apple products | స్టిక్కర్లు అతికించి విక్రయం

నిందితులు ముంబై నుంచి డూప్లికేట్​ యాపిల్​ వాచ్​లు, ఎయిర్​ పాడ్స్​, పవర్​ బ్యాంకులు, కేబుళ్లు కొనుగోలు చేస్తున్నారు. వాటికి యాపిల్​ స్టిక్కర్లు, లోగోలు అతికించి హైదరాబాద్​లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పోలీసులు వారిపై దాడి చేశారు. రూ.మూడు కోట్ల విలువ చేసే యాపిల్​ యాక్సెసరీస్​ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. యాపిల్​ ప్రతినిధులతో కలిసి పోలీసులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఇతర కంపెనీల వస్తువులతో పోలిస్తే యాపిల్​ ప్రోడక్టులకు ధర అధికంగా ఉంటుంది. అయినా చాలా మంది వీటిని కొనుగోలు చేస్తారు. అయితే నకిలీ యాపిల్​ ఉత్పత్తుల స్కాం వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రూ.వేలు పెట్టి తాము కొనుగోలు చేసిన యాపిల్​ సామగ్రి అసలుదా.. నకిలీదా అని ఆలోచిస్తున్నారు. బ్రాండ్​, నాణ్యత కోసం చాలా మంది యాపిల్​ యాక్సెసరీస్​ కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిందితులు హైదరాబాద్​లో ఎన్ని కోట్ల విలువైన నకిలీ వస్తువులు విక్రయించారో పోలీసుల విచారణలో తేలనుంది.