అక్షరటుడే, హైదరాబాద్: Tanvi The Great | ఆటిజంతో బాధపడుతున్న వారిపట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో టాటా పవర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (TPCDT) హైదరాబాద్‌లో “తన్వి ది గ్రేట్” ప్రత్యేక చిత్ర ప్రదర్శనను నిర్వహించింది.
అనుపమ్ ఖేర్ స్టూడియో(Anupam Kher Studio)తో కలిసి, టాటా పవర్ చేపట్టిన ‘పే అటెన్షన్’ కార్యక్రమం కింద ఈ ఈవెంట్ జరిగింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు న్యూరోడైవర్స్ వ్యక్తులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులతో సహా 350 మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, పే అటెన్షన్ సెన్సరీ ఎక్స్‌పీరియన్స్ జోన్(Pay Attention Sensory Experience Zone)ను ఏర్పాటు చేశారు. న్యూరోడైవర్స్ దృక్పథం నుంచి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని హాజరైనవారిలో కల్పించింది.
ఈ సందర్భంగా టాటా పవర్ సీహెచ్ఆర్వో & చీఫ్ సస్టైనబిలిటీ & సీఎస్ఆర్ హిమాల్ తివారీ(CSR Himal Tiwari) మాట్లాడుతూ.. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులను భిన్నంగా చూడటం కాకుండా, ప్రతి ఒక్కరి ప్రత్యేకతను అంగీకరించడమే నిజమైన సమగ్రత అని అన్నారు. దేశ మొట్టమొదటి భౌతిక, డిజిటల్ న్యూరోడైవర్సిటీ సపోర్ట్ నెట్‌వర్క్ అయిన ‘పే అటెన్షన్’ కార్యక్రమం ద్వారా అందరినీ కలుపుకుపోయే ప్రపంచాన్ని నిర్మించడానికి టాటా పవర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. “తన్వి ది గ్రేట్”(Tanvi the Great) తనకు ఎంతో ఇష్టమని.. తన మేనకోడలు తన్వి నుంచి ప్రేరణ పొంది తీసిన చిత్రమని తెలిపారు. ఆటిజం(Autism) కలిగిన అనేక మందిలాగే, ఆమె కూడా ప్రతిభ, సామర్థ్యం ఉన్న వ్యక్తి అని ఆయన తెలిపారు. ఈ కథ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను చేరినప్పుడే నిజమైన విజయం లభిస్తుందని ఖేర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Tanvi The Great | సినిమా గురించి..
“తన్వి ది గ్రేట్” అనేది ఒక యువ న్యూరోడైవర్స్(Neurodiverse) అమ్మాయి తన కలను చేరుకోవడానికి సామాజిక పరిస్థితులు, పరిమితులను ధిక్కరించే శక్తివంతమైన చిత్రం. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల సవాళ్లు, బలాలను సున్నితంగా వివరిస్తూ తీసిన సినిమా ఇది.