Russia Oil
Russia Oil | ఎవ‌రికోస‌మో మా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆపేసుకోవాలా? ఈయూ దేశాల హెచ్చ‌రిక‌ల‌పై భార‌త్ ప్ర‌శ్న‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Russia Oil | రష్యా నుంచి చ‌మురు దిగుమతులు చేసుకోవ‌ద్ద‌న్న ప‌శ్చిమ దేశాల అభ్యంత‌రాల‌ను ఇండియా కొట్టిప‌డేసింది. ర‌ష్యా నుంచి అరుదైన ఖ‌నిజాలు చేస్తున్న దేశాలు త‌మ‌ను చ‌మురు దిగుమ‌తి చేసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డం వింత‌గా అనిపిస్తోంద‌ని తెలిపింది.

ఉక్రెయిన్‌పై దాడులు నేప‌థ్యంలో ర‌ష్యాపై అమెరికా, నాటో దేశాలు ఆంక్ష‌లు విధించాయి. అయితే దేశ అవ‌స‌రాల రీత్యా ఇండియా (India)ర‌ష్యా నుంచి త‌క్కువ ధ‌ర‌కే భారీగా చ‌మురు(Oil) దిగుమ‌తి చేసుకుంటోంది. దీనిపై నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఇండియా స‌హా ఇత‌ర దేశాలు ర‌ష్యా నుంచి ఎలాంటి ఉత్ప‌త్తులు కొనుగోలు చేయొద్ద‌ని, లేక‌పోతే ఆంక్ష‌లు విధిస్తామ‌ని యూరిపియ‌న్ యూనియ‌న్ (European Union) హెచ్చ‌రించింది. ఆ హెచ్చ‌రిక‌లను యూకేలోని భారత రాయ‌బారి విక్రమ్ దొరైస్వామి (Indian Ambassador Vikram Doraiswamy) కొట్టిప‌డేశారు. ఇత‌రుల‌ కోసం ఒక దేశం తన ఆర్థిక వ్యవస్థను ఆపివేసుకోవాలా? అని ప్ర‌శ్నించారు.

Russia Oil | చెప్పే ముందు చేయాలి క‌దా..

బ్రిటిష్ రేడియో స్టేషన్(British Radio Station) టైమ్స్ రేడియోతో మాట్లాడిన భార‌త రాయ‌బారి.. ఈయూ హెచ్చరిక‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. ర‌ష్యా నుంచి ఎలాంటి ఉత్ప‌త్తులు కొనొద‌చ్చ‌ని చెబుతున్న‌ అదే యూరోపియన్ యూనియ‌న్‌లోని భాగస్వామ్య దేశాలు మ‌రీ ఆ దేశం నుంచి ఎందుకు కొనుగోళ్లు చేస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. మీరు చెబుతున్న అదే ర‌ష్యా(Russia) నుంచి మీ భాగ‌స్వామ్య దేశాలు అరుదైన ఖ‌నిజాలు, ఇతర ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తూనే ఉన్నాయి క‌దా? అని నిల‌దీశారు. ఇత‌రుల‌కు చెప్పే ముందు మ‌నం పాటించాలి క‌దా అని ప్ర‌శ్నించారు.

ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశం.. సాంప్రదాయకంగా మధ్యప్రాచ్యం నుంచి ఎక్కువ‌గా చమురును కొనుగోలు చేస్తుంది. అయితే, ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్​తో యుద్ధం ప్రారంభించిన ర‌ష్యాపై ప్ర‌పంచ దేశాల ఆంక్ష‌ల నేప‌థ్యంలో ర‌ష్యా త‌క్కువ ధ‌ర‌కే ఇంధ‌నాన్ని విక్ర‌యించేందుకు ముందుకొచ్చింది. ఈ అవ‌కాశాన్ని భార‌త్ అందిపుచ్చుకుంది. క్రెమ్లిన్ నుంచి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.

Russia Oil | ర‌ష్యాతో స‌న్నిహిత సంబంధాలు

ర‌ష్యాతో భార‌త్‌కు అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని దొరైస్వామి తెలిపారు. రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు అనేక కొలమానాలపై ఆధారపడి ఉన్నాయ‌న్నారు. “వీటిలో ఒకటి మా దీర్ఘకాల భద్రతా సంబంధం, మా పాశ్చాత్య భాగస్వాములు కొందరు మాకు ఆయుధాలను అమ్మరు. కానీ మాపై దాడి చేసే పొరుగు దేశాలకు మాత్రమే అమ్ముతారు” అని భారత రాయబారి విమ‌ర్శించారు. భారతదేశం రష్యాతో “శక్తి సంబంధాన్ని” కలిగి ఉందన్నారు. “మన చుట్టూ ఉన్న దేశాలతో ఇతర దేశాలు తమ సొంత సౌలభ్యం కోసం సంబంధాలను కొనసాగిస్తున్నాయని, అవి మనకు ఇబ్బందులను కలిగిస్తున్నాయని కూడా మనం చూస్తున్నాం. విధేయతకు ఒక చిన్న పరీక్ష పెట్టమని మేము మిమ్మల్ని అడుగుతామా?” అని ప్ర‌శ్నించారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదంపై మాట్లాడుతూ.. “ఇది యుద్ధ యుగం కాదు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పదే పదే చెప్పారని గుర్తు చేశారు. “రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో సహా ఆయన ఆ విషయాన్ని పదే పదే చెప్పారు” అని తెలిపారు. “ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు ఆగిపోవాలని మేము కోరుకుంటున్నట్లే, ఈ భయంకరమైన ఘర్షణ ఆగిపోవాలని మేము కోరుకుంటున్నాము” అని దొరైస్వామి తెలిపారు.