అక్షరటుడే, వెబ్‌డెస్క్: Parliament Sessions | లోక్‌సభలో సోమవారం కీలక చర్చ జరుగనుంది. పాకిస్తాన్‌పై భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై (Operation sindoor) లోక్‌సభ చర్చించనుంది. అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరుగనుంది.
వర్షాకాల సమావేశాలు (Parliament monsoon sessions) ప్రారంభమైన నాటి నుంచి ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు ఎన్డీయే సర్కారు (NDA Government) తొలిరోజునే ప్రకటించింది. అయినప్పటికీ విపక్షాలు సభలో నిరసనలు కొనసాగించాయి. చివరకు గత వారం స్పీకర్ ఓంబిర్లా (Speaker om birla) ఇరుపక్షాల నేతలతో సమావేశం నిర్వహించగా, సభ సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కోసం సోమవారం 16 గంటల పాటు సమయం కేటాయిస్తున్నట్లు గతంలోనే స్పీకర్ తెలిపారు. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో లోక్‌సభలో మాటల యుద్ధం జరుగడం ఖాయంగా కనిపిస్తోంది.
Parliament Sessions | నేడు లోక్‌సభలో, రేపు రాజ్యసభలో ..
జూలై 28న “భారతదేశం బలమైన, విజయవంతమైన నిర్ణయాత్మక ఆపరేషన్ సిందూర్”పై చర్చ చేపట్టనున్నట్లు లోక్‌సభ ఇప్పటికే బిజినెస్ లిస్టింగ్‌లో (Business Listing) చేర్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే కూడా చర్చలో పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm modi) చివరకు ముగింపు ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌పై మంగళవారం రాజ్యసభలో కూడా చర్చ జరుగనుంది.
Parliament Sessions | దాడికి సిద్ధమైన విపక్షం..
కేంద్రంపై దాడి చేసేందుకు విపక్ష ఇండియా అలయెన్స్ (India Alliance) సిద్ధమవుతోంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) పదేపదే చేసిన వాదనలపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టనున్నారు. చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ రాజీవ్ రాయ్ మాట్లాడతారని చెబుతున్నారు. టీడీపీ నుంచి ఎంపీలు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, హరీశ్ బాలయోగికి కూడా లోక్‌సభలో 30 నిమిషాలు కేటాయించారు. జూలై 28న లోక్‌సభలో 16 గంటల చర్చ జరుగుతుందని, ఆ తర్వాత జూలై 29న రాజ్యసభలో 16 గంటల చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. “అన్ని అంశాలను కలిసి చర్చించలేము… ప్రతిపక్షాలు అనేక డిమాండ్లను లేవనెత్తాయి. కానీ ఆపరేషన్ సిందూర్‌పై చర్చ మొదట వస్తుంది. ఇతర అంశాలను తరువాత చర్చకు తీసుకుంటారు” అని రిజిజు అన్నారు.
Parliament Sessions | పహల్గామ్‌లో దారుణ దాడి..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam terrorist attack) ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులను ముష్కరులు మతం అడిగి మరీ చంపారు. ఈ దారుణ ఉగ్ర ఘటనపై యావత్ జాతి ఆగ్రహంతో ఊగిపోయింది. దేశాన్ని కదిలించిన ఈ దారుణంపై తీవ్రంగా స్పందించిన కేంద్రం.. ముష్కరుల ఆట కట్టించేందుకు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. పాకిస్తాన్ ఎదురుదాడికి దిగడంతో ఇండియా శత్రు దేశంలోని సైనిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. దీంతో వణికిపోయిన దాయాది.. కాల్పుల విరమణకు ప్రతిపాదించడంతో కేంద్రం దాడులను నిలిపి వేసింది. అయితే, భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడంపై విపక్షం కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టింది. ట్రంప్ ఆరోపణలను కేంద్రం ఖండించినప్పటికీ, సభలో చర్చించాలని పట్టుబట్టింది. ఈ అంశంపై సోమవారం లోక్‌సభ చర్చించనుంది.