అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srishti Clinic | సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ (Srishti Test Tube Center) అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పిల్లలు లేని దంపతలు కోరికను ఆసరాగా చేసుకొని ఐవీఎఫ్ (IVF), సరోగసి (Surrogacy) పేరిట ఈ క్లినిక్‌లో భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ నమ్రత మోసాలను డీసీపీ రష్మి పెరుమాళ్ ఆదివారం వెల్లడించారు.
రాజస్థాన్‌కు చెందిన దంపతులకు పిల్లలు పుట్టలేదు. దీంతో వారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో సంప్రదించారు. డాక్టర్ నమ్రత వారికి పరీక్షలు చేసి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పింది. సరోగసి (అద్దె గర్భం) ద్వారా పిల్లలను కనొచ్చని వారికి నమ్మకం కలిగించింది.
Srishti Clinic | రూ.40 లక్షలు వసూలు చేసి..
సరోగసి కోసం రూ.40 లక్షలు ఖర్చు అవుతాయని ఆ దంపతులకు డాక్టర్ నమ్రత చెప్పింది. దీంతో వారు ఆ మొత్తం చెల్లించారు. అయితే సరోగసి విధానం కాకుండా వేరే మహిళకు పుట్టిన బిడ్డను ఆ దంపతులకు అప్పగించారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డను దంపతులకు అప్పగించారు. సరోగసి ద్వారా ఆ బిడ్డ పుట్టిందని నమ్మించారు. ఢిల్లీకి చెందిన మహిళకు రూ.90వేలు ఇచ్చారు.
Srishti Clinic | తప్పుడు పత్రాలతో..
డాక్టర్ నమ్రత తప్పుడు పత్రాలతో ఆ దంపతులను మోసం చేశారు. సరోగసి ద్వారా పుట్టినట్లు పత్రాలు సృష్టించింది. అంతేకాకుండా తప్పుడు డీఎన్ఏ రిపోర్టు (DNA Report) కూడా తయారు చేయడం గమనార్హం. అయితే ఆ దంపతులకు అనుమానం కలగడంతో మళ్లీ డీఎన్ఏ టెస్ట్ చేయించగా అసలు విషయం బయట పడింది. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వీరినే కాకుండా చాలా మందిని మోసం చేసినట్లు సమాచారం.
Srishti Clinic | చాలా మంది జాబితా
పేద మహిళల నుంచి బిడ్డలను కొనుగోలు చేసి సరోగసి పేరిట దంపతులకు డాక్టర్ నమ్రత అప్పగించినట్లు తెలుస్తోంది. ఐవీఎఫ్ విధానంలోను భర్త వీర్యం కాకుండా ఇతరుల వీర్యంతో అండాలను అభివృద్ధి చేసి మోసాలకు పాల్పడింది. పేదవారికి కొన్ని డబ్బులు ఇచ్చి వారి పిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరిట దంపతుల దగ్గర రూ.లక్షలు తీసుకొని వారికి అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో సైతం విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కొందరు ఏజెంట్లను పెట్టుకొని డాక్టర్ నమ్రత పేద దంపతుల నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. నమ్రత దగ్గర చాలా మంది సరోగసి కోసం వచ్చిన దంపతుల డేటా ఉంది. ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Srishti Clinic | త్వరలో కస్టడీకి..
ఐవీఎఫ్, సరోగసి పేరిట మోసాలకు పాల్పడుతున్న డాక్టర్ నమ్రతతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మారేడ్‌పల్లి కోర్టులో ఆదివారం హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Srishti Clinic | గాంధీ ఆస్పత్రి వైద్యుడికి లింకులు
సృష్టి క్లినిక్ కేసులో గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) వైద్యుడికి లింక్ ఉండడం గమనార్హం. గాంధీ ఆస్పత్రి డాక్టర్ సదానందంను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా స్పెషలిస్ట్‌గా ఉన్న సదానందం కొంతకాలంగా సృష్టి క్లినిక్‌లో పని చేస్తున్నాడు. డాక్టర్ నమ్రతతో కలిసి అక్రమ సరోగసి చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.