అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srishti Test Tube Baby Center | సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ (Test Tube Baby Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ (Secunderabad)తో పాటు, విజయవాడ, విశాఖపట్నంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Srishti Test Tube Baby Center | అసలు ఏం జరిగిందంటే..
ఓ జంటకు వివాహమై ఏడేళ్లు అవుతున్నా పిల్లలు కాలేదు. దీంతో సికింద్రాబాద్‌లోని (Secunderabad) సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. సదరు మహిళ అండం, ఆమె భర్త వీర్యంతో సెంటర్లో పిండం అభివృద్ధి చేయాలి. అయితే సెంటర్ నిర్వాహకులు ఆమె భర్త వీర్యంతో కాకుండా మరో వ్యక్తి వీర్యంతో పిండం అభివృద్ధి మహిళ గర్భంలో ప్రవేశ పెట్టారు. ఆమెకు బాబు పుట్టగా.. అతడికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు డీఎన్ఏ టెస్ట్ (DNA Test) చేయించగా.. అసలు విషయం వెలుగు చూసింది. తన భర్త వీర్యంతో కాకుండా వేరొకరి స్పెర్మ్‌తో బిడ్డ పుట్టేలా చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సెంటర్లలో తనిఖీలు చేపట్టారు.
Srishti Test Tube Baby Center | లైసెన్స్ రద్దు చేసినా..
డాక్టర్ నమ్రత (Doctor Namratha) సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నడుపుతోంది. తల్లి కావాలనే మహిళల ఆశను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతోంది. ఈమె గతంలో సైతం అక్రమాలకు పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. లైసెన్స్ రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం ఇతరులపై పేరుపై టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తోంది. విజయవాడలో ముగ్గురు డాక్టర్ల ద్వారా ఈమె కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐవీఎఫ్ పేరిట ఇతరుల వీర్యంతో ఇలా చాలా మందికి పిల్లలు కలిగేటట్లు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మారేడ్‌పల్లి జడ్జి ఎదుట నమ్రమతతో పాటు ఏడుగురి నిందితులను ఆదివారం ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
Srishti Test Tube Baby Center | స్పెర్మ్ క్లినిక్‌పై పోలీసుల దాడులు
హైదరాబాద్‌లోని (Hyderabad) ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరిస్తున్నట్టు గుర్తించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్పెర్మ్ డొనేటర్లకు రూ.4 వేల వరకు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తుండడంతో కేసు నమోదు చేశారు.