అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు దమ్ముంటే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌తో చర్చకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. కేటీఆర్ చర్చకు అంగీకరిస్తే తానే వేదికను ఏర్పాటు చేస్తానన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీని నడపడం చేతకాకే బీజేపీలో విలీనానికి సిద్ధమయ్యారని సీఎం రమేశ్ (CM Ramesh) చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్‌ను (Critical Care Unit) ఆదివారం ప్రారంభించిన అనంతరం బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అవినీతికి కొమ్ముకాయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువల్ని పక్కనపెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సీఎం రమేష్ చెప్పిన విషయాలు నిజమని, కానీ బీజేపీ అలాంటి విలీనాన్ని ఒప్పుకోదని స్పష్టం చేశారు.
Bandi Sanjay | సీఎం రమేశ్ వల్లే ఎమ్మెల్యే అయిండు..
బీఆర్ఎస్ పార్టీ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు సిగ్గులేకుండా సీఎం రమేశ్‌ను విమర్శిస్తున్నాడని, వాస్తవానికి ఆయన లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేశ్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇస్తే, సీఎం రమేశ్ చెప్పడంతోనే కేసీఆర్(KCR) చివరకు కేటీఆర్‌కు టికెట్ ఇచ్చాడన్నారు. ప్యారగాన్ చెప్పులు వేసుకుని తిరుగుతున్న కేటీఆర్‌కు సీఎం రమేశ్ ఆర్థిక సాయం చేయడంతోనే ఎమ్మెల్యే అయ్యాడని తెలిపారు.
Bandi Sanjay | విలీనం వాస్తవమే..
బీఆర్ఎస్ పార్టీని (BRS Party) నడుపుకునే సత్తా లేదని, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని సంజయ్ విమర్శించారు. బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేశ్ చెప్పింది వాస్తవమని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కవిత (MLC Kavitha) కూడా చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ తన దగ్గరకు వచ్చి తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని ఆశీర్వదించాలని తనను అడిగినట్లు నరేంద్ర మోదీ గతంలోనే వెల్లడించారని గుర్తు చేశారు. సీఎం రమేశ్‌తో కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.
చర్చకు వస్తే సీఎం రమేశ్‌ను తాను తీసుకు వస్తానని చెప్పారు. తప్పించుకునే మాటలు చెప్పకుండా చర్చకు రావాలని సూచించారు. కరీంనగర్ లేదా హైదరాబాద్ వేదికగా ఎక్కడైనా చర్చా వేదిక తానే ఏర్పాటు చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) చర్చకు రమ్మంటున్నారని, ఇందులో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
Bandi Sanjay | రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదు..
కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా వ్యక్తి మీద మాట్లాడితే చర్యలు చేపట్టక పోవడం ప్రభుత్వ చేతగానితనమన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చేతగాదేమో కానీ, తమ పార్టీ గురించి సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.
Bandi Sanjay | విద్య, వైద్యానికి ప్రాధాన్యం..
నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఏటా రూ.1.18 కోట్లను వైద్యం కోసం వెచ్చిస్తోందని, విద్య కోసం రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 11 ఏళ్లలో వైద్య రంగాభివృద్ధికి కృషి చేసిందని, ఎయిమ్స్‌లతో పాటు వైద్య కళాశాలలు రెట్టింపు స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంబీబీసీ, పీజీ సీట్లు రెండింతలయ్యాయన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలకు మళ్లిస్తోందని విమర్శించారు.
Bandi Sanjay | ఓట్ల కోసమే ఆలయం కూల్చివేత..
హిందూ దేవాలయాలను కూల్చడంపై బండి సంజయ్ విమర్శించారు. బంజారాహిల్స్‌లోని పెద్దమ్మగుడి(Banjara Hills Peddamma Temple)ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఎన్నికలు ఉన్నాయని, ముస్లింల ఓట్ల కోసమే పెద్దమ్మ గుడిని కూల్చివేశారని ఆరోపించారు. హిందూ ఆలయాలపై పడే ప్రభుత్వం ఇతర మతాల ఆలయాలకు జోలికి వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. 80 శాతం హిందువుల ఓట్లను ఏకీకరణ చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.
Bandi Sanjay | బీసీల పేరిట కాంగ్రెస్ దగా..
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పేరిట కాంగ్రెస్ బీసీలను దగా చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ హిందువులకు, తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. గతంలో ఉన్న 34 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించారన్నారు. బీసీలకు ఇచ్చింది 5 శాతం, ముస్లింలకు 10 శాతం కోటా ఇచ్చారని విమర్శించారు. కొన్ని బీసీ సంఘాలు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాయని, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి తగిన బుద్ధి చెబుతారన్నారు.50 శాతం ఉన్న రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతామని రాహుల్‌గాంధీ అంటున్నారని, అది సాధ్యం కాదన్నారు. హిందూ ధర్మాన్ని దెబ్బతీయడం మీ తాత, నానమ్మ, నాన్నతోనే కాలేదని, నీతోనే ఏమవుతుందన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీని కన్వర్టెడ్ బీసీ అంటున్న రాహుల్‌గాంధీది ఏ కులమో, ఏ మతమో చెప్పాలని డిమాండ్ చేశారు.