Banglore Stampede
Bangalore Stampede | బెంగ‌ళూరు తొక్కిస‌లాట‌..13 ఏళ్ల బాలిక‌ మృత‌దేహంపై ల‌క్ష రూపాయ‌ల న‌గ‌లు మాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bangalore Stampede | ఐపీఎల్ 2025 IPL 2025 టైటిల్ గెలిచిన సందర్భంగా జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న అంద‌రిని క‌లిచివేసింది. అయితే ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలిక దివ్యాంశి మృతదేహం నుంచి రూ. లక్ష విలువైన బంగారు ఆభరణాలు మాయం కావ‌డం ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దివ్యాంశి తల్లి అశ్విని శివకుమార్ ఫిర్యాదు మేరకు బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌(Street Police Station)లో కేసు నమోదైంది. అశ్వినీ ఫిర్యాదు ప్రకారం, జూన్ 4 సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో దివ్యాంశి మృతి చెందగా, ఆమె మృతదేహాన్ని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రి(Bowring and Lady Curzon Hospital) మార్చురీకి తరలించారు.

Bangalore Stampede | న‌గ‌లు చోరి..!

అప్పటికి దివ్యాంశి చెవుల‌కి 6 గ్రాముల బంగారు పోగులు, మెడలో 5-6 గ్రాముల బంగారు గొలుసు ఉన్నాయని అశ్వినీ తెలిపారు. అయితే, శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తిరిగి అందించినప్పుడు ఆభరణాలు కనిపించలేదు. మొదట్లో అంద‌రం తీవ్ర విషాదంలో ఉండటంతో ఆభరణాలని గమనించలేకపోయాం. కానీ ఆ న‌గ‌లు నా కూతురి చివరి జ్ఞాపకాలు. వాటికి ఎంతో భావోద్వేగ విలువ ఉంది అని ఆమె పేర్కొన్నారు. ఆ ఆభరణాలు మళ్ళీ దొరికితే, నా బిడ్డను పూర్తిగా కోల్పోయినా… కనీసం ఆమె జ్ఞాపకాలను మాత్రం మిగిలినట్టే అని భావోద్వేగంతో చెప్పింది దివ్యాంశి త‌ల్లి. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

దివ్యాంశి, యలహంక సమీపంలోని కన్నూరు ప్రాంతానికి చెందిన చిన్నారి. క్రికెట్‌కి, ముఖ్యంగా విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఆమె వీరాభిమాని. తన తల్లి, అత్త, చెల్లెలు తదితర కుటుంబ సభ్యులతో కలిసి ఆర్సీబీ విజయోత్సవాల కార్యక్రమానికి హాజరైంది. అయితే, ఆ సందడి విషాదంగా ముగిసింది. ఆ ఘోర తొక్కిసలాటలో దివ్యాంశి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో దివ్యాంశే అతి చిన్న వయస్కురాలు. అశ్వినీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయసంహిత (Indian Code of Laws) సెక్షన్ 303(2) కింద కేసు నమోదు చేశారు. శవపరీక్షకు ముందు తీసిన ఫోటోల్లో ఆభరణాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మార్చురీలోనే చోరీ జరిగి ఉంటుందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. శివాజీనగర్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రి మార్చురీ(Hospital Morgue)ల్లో భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది.