Heavy Rains
Heavy Rains | ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన.. ప్రాజెక్ట్​లకు పెరిగిన ఇన్​ఫ్లో

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rains | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా నాలుగు రోజుల పాటు వాన దంచికొట్టింది. ఎడ తెరిపి లేకుండా వాన పడడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో (Heavy Rains) చెరువులు, ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్​ నగరంలో సహా పలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Heavy Rains | శ్రీరాం​సాగర్​కు పెరిగిన వరద

స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ఉత్తర తెలంగాణల వర ప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు (Sriramsagar Project) ఇన్​ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు​లోకి ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు నిజాంసాగర్​ ప్రాజెక్టుకు (Nizamsagar Project) సైతం వరద స్వల్పంగా పెరిగింది. జలాశయం​లోకి ప్రస్తుతం 1600 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

Heavy Rains | కల్యాణి ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తివేత

ఎల్లారెడ్డి శివారులోని కల్యాణి ప్రాజెక్ట్​ (Kalyani Project) నిండుకుండలా మారింది. 640 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్ల కాగా ప్రస్తుతం 408.50 మీటర్లకు చేరింది. దీంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Heavy Rains | పోచారం డ్యాం​కు పెరిగిన ఇన్​ఫ్లో

గాంధారి, లింగంపేట, రాజంపేట, తాడ్వాయి, మెదక్​ జిల్లా హవేళి ఘన్​పూర్​లో కురిసిన భారీ వర్షాలతో నాగిరెడ్డిపేట శివారులోని పోచారం ప్రాజెక్ట్​కు భారీగా వరద వస్తోంది. లింగంపేట పెద్దవాగు, గుండారం వాగుల ద్వారా డ్యామ్​లోకి 10 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 20.5 అడుగులు కాగా.. ప్రస్తుతం 15.3 అడుగులకు చేరుకుంది. వరద ఇలాగే కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో ప్రాజెక్ట్​ నిండే అవకాశం ఉంది.

Heavy Rains | ఉధృతంగా పారుతున్న వాగులు

వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని వాగులు ఉధృతంగా పారుతున్నాయి. సిరికొండలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అమర్లబండ, దేమికాలన్ వాగులకు భారీగా వరద వస్తోంది. లింగంపేట పెద్దవాగు, తాడ్వాయి మండలంలో భీమేశ్వర వాగు, రాజంపేట మండలంలో గుండారం వాగులు సైతం ఉధృతంగా పారుతున్నాయి. పలు చోట్ల తాత్కాలిక రోడ్లు తెగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.