అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team India | మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. నువ్వా, నేనా అన్నట్టు ఇంగ్లండ్, భారత జట్లు పోరాడుతున్నాయి. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆటను ఇంగ్లండ్ (England) 544/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించింది. చివరకు 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 311 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఈ ఇద్దరినీ ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ తన తొలి ఓవర్‌లోనే ఔట్ చేయడంతో భారత శిబిరంలో ఆందోళన ఏర్పడింది.
Team India | ఏం చేస్తారో మరి..
ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లిష్ జట్టు గెలుస్తుందని అనుకోగా, కేఎల్ రాహుల్ (87 నాటౌట్ – 210 బంతుల్లో 8 ఫోర్లు), శుభ్‌మన్ గిల్(Shubhman Gill) (78 నాటౌట్ – 167 బంతుల్లో 10 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 137 పరుగుల వెనుక ఉంది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 8 వికెట్లు అవసరం. భారత్ ఓటమి నుంటి తప్పించుకోవాలంటే చివరి రోజు రెండున్నర సెషన్లు ఓర్పుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తొలి సెషన్‌ను జాగ్రత్తగా ఆడడం అత్యంత కీలకం. ప్రస్తుతం భారత జట్టు(Team India) పూర్తిగా డ్రా కోసం ఆడుతోంది. రిషబ్ పంత్ ఇప్పటికే గాయపడగా.. అతను బ్యాటింగ్‌కి వస్తాడో లేదో సందేహం నెలకొంది. ఈ సమయంలో ఇప్పుడు భారత జట్టు భారమంతా రాహుల్, గిల్‌లపైనే ఉంది.
అంతకుముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్(England Batsman Stokes) అద్భుత సెంచరీతో (198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు సహా 141 పరుగులు) ఆకట్టుకున్నారు. ఇక బ్రైడన్ కార్స్ (54 బంతుల్లో 47 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా 4 వికెట్లు (134 పరుగులకు), జస్ప్రిత్ బుమ్రా (2/112), వాషింగ్టన్ సుందర్ (2/107) తలో రెండు వికెట్లు, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. మొత్తానికి మ్యాచ్ తుదిదశకు చేరుకుంది. భారత్‌కు డిఫెన్సివ్ బ్యాటింగ్ చేస్తే తప్ప మరో మార్గం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (Kl Rahul) తన కెరీర్‌లో ఒక భారీ మైలురాయిని చేరుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున తన పోరాట పటిమను ప్రదర్శించిన రాహుల్, అంతర్జాతీయ క్రికెట్‌లో 9,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 16వ భారతీయ క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలవడం విశేషం.