అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు లంచాలకు మరిగారు. కొందరు అధికారులు డబ్బులు తీసుకోనిదే పనులు చేయడం లేదు. తాజాగా ఓ పంచాయతి కార్యదర్శి (Panchayat Secretary) రూ.50 వేలు లంచం తీసుకున్నాడు. అయితే ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన కారులో పరారయ్యాడు.
రంగారెడ్డి(Rangareddy) జిల్లా కొత్తూరు మండలం ఇన్మూల్నర్వ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కె సురేందర్ పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి భవన నిర్మాణం చేపట్టాడు. అయితే సదరు నిర్మాణానికి జీపీ కార్యదర్శి సురేందర్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు పక్కన పెట్టడానికి ఆయన రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో శనివారం బాధితుడి నుంచి జీపీ కార్యదర్శి సురేందర్ రూ.50 వేలు లంచం తీసుకున్నాడు.
ACB Case | ఏసీబీ అధికారులను చూసి..
లంచం తీసుకున్న కార్యదర్శి సురేందర్ ఏసీబీ అధికారులు (ACB Officers) రావడాన్ని గమనించాడు. వెంటనే కారులో డబ్బుతో సహా పరారు అయ్యాడు. అధికారులు గాలించి ఆ వాహనంతో పాటు లంచంగా తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేందర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.
ACB Case | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.