అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Test Tube Baby Center | తల్లి కావడం ప్రతి మహిళ కల. ఆ క్షణం కోసం మహిళలు ఏంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. తమ బిడ్డను ఎత్తుకొని మురిసిపోవాలని దంపతులు (Couples) కలలు కంటారు. అయితే మారుతున్న జీవన పరిస్థితులతో పలు జంటలకు త్వరగా పిల్లలు కావడం లేదు. తల్లి కావాలన్న మహిళల ఆశలను ఆసరాగా తీసుకొని దేశంలో చాలా ఐవీఎఫ్ (IVF), టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు (Test Tube Baby Centers) పుట్టుకొచ్చాయి. అయితే డబ్బుల కోసం పలు సెంటర్లు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా తన భర్త వీర్యంతో కాకుండా వేరొకరి స్పెర్మ్‌తో పిండం అభివృద్ధి చేశారని ఓ మహిళా టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ జంటకు వివాహమై ఏడేళ్లు అవుతున్నా పిల్లలు కాలేదు. దీంతో సికింద్రాబాద్ (Secunderabad)లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. సదరు మహిళ అండం, ఆమె భర్త వీర్యంతో సెంటర్‌లో పిండం అభివృద్ధి చేయాలి. అయితే సెంటర్ నిర్వాహకులు ఆమె భర్త వీర్యంతో కాకుండా మరో వ్యక్తి వీర్యంతో పిండం అభివృద్ధి మహిళ గర్భంలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆమెకు మగ శిశువు పుట్టాడు.
Test Tube Baby Center | అనారోగ్యానికి గురికావడంతో..
తమకు బిడ్డ పుట్టారని ఆ దంపతులు ఎంతో ఆనందించారు. అయితే ఆ బాలుడు తరుచూ అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చూపెట్టారు. దీంతో బాలుడికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అయితే తమ ఇద్దరి కుటుంబాల్లో ఎవరికి క్యాన్సర్ లేకపోవడంతో అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ (DNA Test) చేయించారు. దీంతో అసలు నిజం వెలుగు చూసింది. భర్త వీర్యంతో కాకుండా మరొకరి వీర్యంతో పిండం అభివృద్ధి చేసినట్లు తేలింది. దీంతో బాధితులు టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Test Tube Baby Center | ఆశ పెట్టి లక్షలు దోచేస్తారు
సంతానం కోసం దంపతులు పడే ఆరాటాన్ని కొందరు వైద్యులు డబ్బు సంపాదన మార్గం మలుచుకున్నారు. పెళ్లయి పిల్లలు కాని జంటల భావోద్వేగాలతో వ్యాపారం చేస్తున్నారు. ఐవీఎఫ్, టెస్ట్‌ట్యూబ్ అని పేర్లు పెట్టి రూ.లక్షలు కాజేస్తున్నారు. తీరా డబ్బులు చెల్లించాక పిల్లలు పుడుతారా అంటే అది గ్యారంటీ లేదు. ఈ విధానంలో సక్సెస్ రేటు అంతంత మాత్రంగానే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇందులోనూ పలు సెంటర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Test Tube Baby Center |డాక్టర్ అరెస్ట్
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో కూడా సోదాలు చేశారు. ఐవీఎఫ్, సరొగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తేలడంతో సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.