అక్షరటుడే, నిజాంసాగర్ : RTC Bus | వానాకాలంలో మనం రోడ్డుపై వెళ్తుండగా పక్క నుంచి వాహనాలు వెళ్తే నీరు, బురద పడుతుంది. అలాంటి సమయంలో వాహనదారుడిని, రోడ్లను తిట్టుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా వదల్లేదు. తనపై బురద పడటానికి కారణమైన వ్యక్తిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాడు. ఈ ఘటన నిజాంసాగర్ (Nizamsagar) మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.
కామారెడ్డి డిపోకు (Kamareddy Depot) చెందిన ఆర్టీసీ బస్సు (Bus) శనివారం నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి వెళ్తోంది. అదే సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారుడిపై వర్షపు(బురద) నీరు పడింది. దీంతో సదరు వ్యక్తి, డ్రైవర్ (Driver)తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయింది. ఇద్దరూ తగ్గకపోవడంతో విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ మేరకు ప్రయాణికులతో ఉన్న బస్సును పోలీస్స్టేషన్ (Police Station)కు తరలించారు. పోలీసులు ఇరువురిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం బస్సును స్టేషన్ నుంచి తీసుకెళ్లారు.
అయితే బురదే కాదా అని వదిలేయకుండా గొడవ పెద్దది చేయడం.. డ్రైవర్ సైతం తగ్గకపోవడంతో ఇక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. బస్సును స్టేషన్కు తరలించి మాట్లాడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.