అక్షరటుడే, నిజాంసాగర్ : Nizam Sagar | రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో కురిసిన వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar Project)కు స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్‌లోకి వరద ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం జలాశయంలోకి 1,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఈఈ సోలోమాన్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1390.50 అడుగుల (4.25 టీఎంసీలు) నీరు ఉంది.
Nizam Sagar | పొంగిపొర్లుతున్న ‘ఘనపురం’
మంజీర నదిపై (Manjira River) నిర్మించిన నిజాంసాగర్‌కు కర్ణాటకలో వర్షాలు పడితేనే భారీగా వరద వస్తుంది. మంజీరకు వరద వస్తే మొదట సింగూరు ప్రాజెక్ట్ నిండాలి. అనంతరం దిగువకు నీటిని విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం సింగూరుకు కూడా స్వల్ప ఇన్‌ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్ట్ ఇప్పట్లో నిండే అవకాశాలు లేవు. అయితే మంజీరపై ఏడుపాయల దేవాలయం సమీపంలో గల ఘనపురం ఆనకట్ట నిండింది. డ్యామ్‌పై నుంచి నీరు పొంగిపొర్లుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో మంజీరలోకి భారీగా వరద వస్తోంది. దీంతో నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది.
Nizam Sagar | పోచారం ప్రాజెక్ట్ ఆదుకుంటుందా..
కామారెడ్డి, మెదక్ సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project)కు భారీగా వరద వస్తోంది. లింగంపేట పెద్ద వాగు, గుండారం వాగులు ఉధృతంగా పారుతున్నాయి. దీంతో జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా వస్తోంది. ఇలాగే వరద కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్ నిండి అలుగు పారనంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పోచారం డ్యామ్ ఆదుకుంటుంది. ఈ డ్యామ్ పొంగిపొర్లడంతో వచ్చిన నీటితోనే నిజాంసాగర్‌కు భారీగా వరద వచ్చింది. ఈ సారి కూడా పోచారం జలాశయం అలుగు పారితే నిజాంసాగర్‌కు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది.
Nizam Sagar | ఉమ్మడి జిల్లా వరప్రదాయిని
నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు సాగు నీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. బాన్సువాడ (Bansuwada), బోధన్ (Bodhan) నియోజకవర్గాల్లోని రైతులు ప్రాజెక్ట్ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. దీంతో ప్రాజెక్ట్ నుంచి జులై 15న నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్ట్ నిండితే రెండు పంటలకు ఢోఖా ఉండదని రైతులు అంటున్నారు.