SBI ATM
SBI ATM | రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎంలో చోరీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI ATM | దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ల నుంచి మొదలు పెడితే బ్యాంకుల వరకు దేనిని వదలడం లేదు. తాజాగా ఆదిలాబాద్​ (Adilabad) పట్టణంలోని ఎస్​బీఐ ఏటీఎం (SBI ATM)లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

ఆదిలాబాద్‌ పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి దొంగలు చొరబడ్డారు. సీసీ కెమెరాలకు బ్లాక్​ స్పే కొట్టారు. అనంతరం గ్యాస్​ కట్టర్​తో ఏటీఎం మిషన్​ను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఏటీఎంలో ఎంత నగదు పోయిందనే వివరాలు తెలియరాలేదు. క్లూస్​ టీమ్​తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

SBI ATM | ఇటీవల హైదరాబాద్​లో..

హైదరాబాద్​ నగరంలోని జీడిమెట్లలో (Jeedimetla) సైతం దొంగలు ఇటీవల ఇదే తరహాలో ఏటీఎంలను చోరీ చేశారు. జీడిమెట్లలోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ (HDFC Bank) ఏటీఎం సెంటర్​లో జులై 8న అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు. గ్యాస్​ కట్టర్​తో మూడు ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసి రూ.34 లక్షలు ఎత్తుకెళ్లారు. కాగా.. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. హర్యానాకు చెందిన ముఠా ఈ చోరీ చేసినట్లు గుర్తించి నిందితులను అరెస్ట్​ చేశారు. ఆదిలాబాద్​లోనూ అదే తరహాలో చోరీ జరగడంతో హర్యానా ముఠా పనేనా.. లేక ఇతరులు చేశారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఇందల్వాయిలో సైతం ఓ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు.