అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ranga Reddy District | ఓ వైపు ఎడతెరపీయని వర్షం ముసురు.. అయినా కళాశాలకు వెళ్లాలి తప్పదని ఆ విద్యార్థిని (student) బయలుదేరింది.. నేను దిగబెడతానని తోడుగా తండ్రి వచ్చాడు.. ఇద్దరూ కలిసి ముసురులోనే తడుస్తూ బైక్‌పై బయలుదేరారు.
ప్రధాన రహదారిపైకి చేరగానే మృత్యు శకటం దూసుకొచ్చింది. ఇద్దరి శరీరాలను ఛిద్రం చేసింది. ఆ మృత్యువు ఇద్దరిని ఒకేసారి బలితీసుకుంది.
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) షాద్‌నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం (జులై 26) ఉదయం ట్యాంకర్, బైక్ ఢీ కొన్న ఘటనలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు. మృతులను షాద్‌నగర్ పట్టణానికి (Shadnagar town) చెందిన మచ్చేందర్, ఆయన కూతురు మైత్రిగా గుర్తించారు.
Ranga Reddy District | హృదయ విదారక దృశ్యం..
తండ్రీకూతురు ప్రయాణిస్తున్న బైక్‌ను ట్యాంకర్ ఢీ కొట్టి ముందుకు వెళ్లిపోవడంతో బైక్ లారీ కింద ఇరుక్కుపోయింది. ఇద్దరి మీదుగా చక్రాలు వెళ్లడంతో శరీరాలు ఛిద్రమయ్యాయి.
మైత్రి దాని వెనుక చక్రాల మధ్య అచేతనంగా పడిపోయింది. ముక్కలైన శరీరం వల్ల కలిగే బాధను పంటి బిగువున భరిస్తూ.. అక్కడ ఉన్నవారి సాయం అర్తించింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని సైగల ద్వారా దగ్గరకు పిలిచి, తన వాళ్లకు సమాచారం అందించాలని ప్రాధేయపడింది.
అటు మచ్చేందర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. శరీరం ఛిద్రం కావడంతో ఉన్నచోట నుంచి కదలలేని దుస్థితి. స్పృహ కోల్పోయే వరకు తన గారాలపట్టి, బంగారు తల్లికి ఏమైందో, ఎక్కడుందో తెలియక తల్లడిల్లిపోయాడు. సాయం కోసం అర్తిస్తూనే ఉండిపోయారు. చివరికి ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు.
తన కూతురు మైత్రిని మచ్చేందర్ శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి (Vardhman College) పంపించేందుకు బస్టాండ్‌కు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. లారీ డ్రైవరును షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.