అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఓ ప్రైవేట్ వాహనం బోల్తా పడి విద్యార్థులకు గాయాలైన ఘటన కామారెడ్డిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
కామారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు (Sri Chaitanya School) చెందిన విద్యార్థులు తూఫాన్ వాహనంలో స్కూల్ నుంచి బయలుదేరారు. స్కూల్ దాటి కొద్దిదూరంలోనే తూఫాన్ వాహనం బోల్తా పడటంతో విద్యార్థులు కేకలు వేశారు. ఈ ప్రమాదం సమయంలో వాహనంలో 15 మంది విద్యార్థులు ఉండగా అందులో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
వీరిని వెంటనే కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తూఫాన్ వాహనం ఒకపక్కన పడకుండా పల్టీ కొట్టి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్ప గాయాలతో పిల్లలు బయట పడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.