అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SHE Team | హైదరాబాద్ (Hyderabad) నగరంలో బోనాల పండుగ (Bonalu Festival)ను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే బోనాల సందర్భంగా ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళలను అసభ్యంగా తాకడం, వేధింపులకు పాల్పడటం, ఈవ్ టీజింగ్ (Eve teasing) చేశారు. అయితే అలాంటి వారి ఆటలను షీ టీమ్ పోలీసులు కట్టించారు. బోనాల సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 644 మందిని అరెస్ట్ చేశారు.
SHE Team | రెచ్చిపోతున్న పోకిరీలు
కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. మహిళలు కనిపిస్తే వారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాలతో పాటు పండుగలు, జాతరల సమయంలో తమను ఎవరు చూడటం లేదని మహిళలను అనవసరంగా తాకుతున్నారు. అంతేగాకుండా పలువురు ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నారు. బోనాల సందర్భంగా ఇలా వ్యవహరించిన 644 మందిని షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. వారిలో 92 మంది మైనర్లు ఉండటం గమనార్హం. వీరిలో పలువురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఐదుగురిని కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి ఏడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.
SHE Team | షీ టీమ్ వాచింగ్ యూ
రద్దీ ఉండే ప్రాంతాల్లో మహిళలను ఆకతాయిలు అసభ్యంగా తాకుతున్నారు. తమను ఎవరూ చూడటం లేదనే భావనలో మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అయితే షీ టీమ్ (She Team) పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో ఉండి ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.
SHE Team | జాగ్రత్తగా ఉండాలి
పబ్లిక్ ప్లేస్ల్లో జాగ్రత్తగా ఉండాలని షీ టీమ్ పోలీసులు మహిళలకు సూచిస్తున్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా డయల్ 100 లేదా, 112 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. వాట్సాప్ నంబర్ 9490616555 కు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సోషల్ మీడియా (Social Media)లో సైతం మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ ఖాతాలతో కొందరు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు ఎక్కువగా షేర్ చేయొద్దని సూచించారు.