అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kargil Vijay Diwas | కార్గిల్ యుద్ధంలో వీర జవాన్లకు హృదయపూర్వక నివాళి అర్పిస్తూ భారత సైన్యం (Indian Army) శనివారం మూడు కీలక కార్యక్రమాలను ఆవిష్కరించనుంది. సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను గౌరవించడంతో పాటు సాయుధ దళాలు, ప్రజల మధ్య సంబంధాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
26వ కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas)ను పురస్కరించుకుని వీటిని ప్రారంభించనుంది. కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటారు. 1999లో ఈ రోజున భారత సైన్యం ఆపరేషన్ విజయ్‌ను విజయవంతంగా ముగించింది. సూపర్-హై-ఆల్టిట్యూడ్ (Super High Altitude) ప్రాంతాలలో దాదాపు మూడు నెలల భీకర పోరాటం తర్వాత పాకిస్తాన్ చొరబాటుదారుల నుంచి కీలక స్థానాలను సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. కార్గిల్ యుద్ధంలో బటాలిక్ను స్వాధీనం చేసుకోవడం కీలకం. 10,000 అడుగుల ఎత్తులో ఉన్న బటాలిక్, కార్గిల్, లేహ్ బాల్టిస్తాన్ మధ్య బటాలిక్ వ్యూహాత్మక స్థానంగా, కార్గిల్ యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉంది.
Kargil Vijay Diwas | ‘ఈ-శ్రద్ధాంజలి’ పోర్టల్
భారత సైన్యం చేపట్టిన ప్రధాన ముఖ్యాంశాలలో ‘ఈ-శ్రద్ధాంజలి’ పోర్టల్(E-Shraddhanjali Portal) ప్రారంభించడం ఒకటి. సైన్యంలో పని చేస్తూ అమరులైన వారికి ప్రజలు డిజిటల్ రూపంలో నివాళులు అర్పించడానికి గాను ఈ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వారిని గుర్తుంచుకోవడానికి, వారికి ప్రజలు కృతజ్ఞత తెలుపడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. “పౌరులు ఇప్పుడు స్మారక చిహ్నాలను సందర్శించకుండానే దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వీరులకు ఈ-శ్రద్ధాంజలి పోర్టల్ ద్వారా నివాళులు అర్పించవచ్చని” ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సాయుధ దళాలు చేసిన త్యాగాలు, వారి విధులను నిర్వర్తించేటప్పుడు వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Kargil Vijay Diwas | QR కోడ్ ఆధారిత ఆడియో అప్లికేషన్
సైన్యం తీసుకోస్తున్న రెండో ప్రాజెక్ట్ QR కోడ్ ఆధారిత ఆడియో అప్లికేషన్. 1999 కార్గిల్ యుద్ధం(Kargil War)లో జరిగిన కీలక పరిణామాలను, భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమాలను వివరిస్తూ రూపొందించిన ఆడియోను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. టోలోలింగ్ కఠినమైన భూభాగాల నుంచి టైగర్ హిల్ వరకు మంచుతో నిండిన ఎత్తయిన పర్వతాలు, అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొని భారత సైన్యం పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది.
ఈ క్రమంలో సైనికులు ప్రదర్శించిన తెగువ, పోరాటం ప్రతి భారతీయుడు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో QR కోడ్ ఆధారిత ఆడియో అప్లికేషన్(QR Code Based Audio Application) ను ప్రారంభిస్తున్నారు. “ఈ భావన మ్యూజియం మాదిరిగానే ఉంటుంది QR కోడ్ స్ఆన్ చేయడం ద్వారా ప్రజలు తమ ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించి సైన్యం పరాక్రమాలను వినవచ్చు. సైనికుల ధైర్యం, శౌర్యం, ధైర్యం, త్యాగాల గాథను వినవచ్చు” అని ఆర్మీ అధికారి వివరించారు.
Kargil Vijay Diwas | ఇండస్ వ్యూపాయింట్
ఇండస్ వ్యూపాయింట్ – బటాలిక్ సెక్టార్(Indus Viewpoint – Batalik Sector)లోని ఒక వ్యూహాత్మక ప్రదేశం. నియంత్రణ రేఖ (LOC) సరిహద్దులను ఇది సందర్శించడానికి పౌరులకు అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. సరిహద్దు రక్షణ స్పష్టమైన వాస్తవాలను చూసినప్పుడు సందర్శకులలో లోతైన దేశభక్తి, ప్రశంసలను ఈ కొత్త పర్యాటక దృక్కోణం పెంపొందిస్తుందని భావిస్తున్నారు. “సైనికులు సేవ చేసే పరిస్థితులు, వారు రోజువారీగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిరంతర ప్రమాదాల గురించి సందర్శకులకు అవగాహన కల్పిస్తుంది. తద్వారా దేశం సురక్షితంగా ఉండేలా చూసుకోవచ్చు” అని అధికారి తెలిపారు.