అక్షరటుడే, వెబ్‌డెస్క్: AB de Villiers | సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (Ab De villiers) వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో (World Championship of Legends 2025) అదరగొడుతున్నాడు. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న డివిలియర్స్ అప్పట్లో ఎంత విధ్వంసం సృష్టించాడో ఇప్పుడు కూడా అంతే జోష్‌తో ఆడుతున్నాడు. వయస్సు 41 అయిన కూడా ఫిట్‌నెస్, ఫామ్ విషయాల్లో మాత్రం అతను మిగిలినవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రీసెంట్‌గా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. అంతేకాదు అద్భుతమైన క్యాచ్ కూడా ఒకటి అందుకున్నాడు. ఈ వయస్సులో డివిలియర్స్ పర్‌ఫార్మెన్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు.
AB de Villiers | దంచి కొట్టుడు..
తాజాగా క్రికెట్ అభిమానులకు మరోసారి “మిస్టర్ 360” ఏబీ డివిలియర్స్ (Mr. 360 AB de Villiers) షో చూపించాడు. తాజాగా జరిగిన డబ్ల్యూసీఎల్ – 2025 టోర్నీలో, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ vs ఇంగ్లాండ్ ఛాంపియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ పాత ఆటను గుర్తు చేశాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ (South African Champions) జట్టు, ఇంగ్లాండ్ (England)ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్, ప్రారంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. కేవలం 41 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసి, 51 బంతుల్లో 116 నాటౌట్‌గా నిలిచాడు. అతనితో పాటు హసీమ్ ఆమ్లా 25 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా సపోర్ట్ అందించాడు.
ఈ జోడీని ఆపడానికి ఇంగ్లాండ్ బౌలర్లకు (England bowlers) ఏమాత్రం అవకాశం దొరకలేదు. చివరకు దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టు కేవలం 12.3 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని సాధించింది. ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డివిలియర్స్ బ్యాటింగ్‌ను చూసిన నెటిజన్లు ‘‘41 ఏళ్ల వయస్సులోనూ ఇలాంటి ఆటనా!’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఆట మీద ఉన్న ప్యాషన్, ఫిట్‌నెస్ (Fitness) ఉంటే ఏదైనా సాధ్యమే అని ఏబీ డివిలియర్స్ మరోసారి ప్రూవ్ చేశాడు.