అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. వివిధ దేశాలపై సుంకాల మోత మోగించడం, వీసాల విధానం కఠినతరం చేయడం, విదేశీయులను వెనక్కి పంపడం, జన్మతః పౌరసత్వం రద్దు చేయడం వంటి పిచ్చి నిర్ణయాలు అమెరికానే (America) తీవ్ర ప్రభావం చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వివిధ టెక్ కంపెనీలకు (Tech Company) సూచించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. భారత్ సహా ఇతర దేశాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Donald Trump | సుంకాల మోతతో మొదలు..
రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. ప్రపంచ దేశాలపై పన్నుల కొరడా ఝళిపించారు. అమెరికా ఫస్ట్ అంటూ ఎన్నికల్లో గళమెత్తిన ట్రంప్.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను (Global Economy) అతలాకుతలం చేసేలా ఆయా దేశాలపై సుంకాల మోత మోగించారు.
తమపై అధిక టారిఫ్‌లు విధిస్తున్నారంటూ పలు దేశాలపై కనీసం 10 శాతం నుంచి 33 శాతం వరకు టాక్సులు పెంచారు. చైనాతో కయ్యానికి కాలు దువ్విన డొనాల్డ్.. ఒక దశలో టారిఫ్‌లను ఏకంగా 150 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. చివరకు వాణిజ్య చర్చల పేరుతో వాటిని 90 రోజులపాటు వాయిదా వేశారు. సుంకాల పేరిట బెదిరిస్తూ మిగిలిన దేశాలను కూడా తన దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తుండడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Donald Trump | భారత్‌తో కయ్యం..
గతంలో భారత్-అమెరికా దేశాల మధ్య సైనిక, వాణిజ్య, దౌత్య సంబంధాలు బాగుండేవి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇవి మరో స్థాయికి వెళ్తారని అంతా ఆశించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi), డొనాల్డ్ మధ్య స్నేహం ఇరు దేశాలకు లాభం చేకూర్చుతుందన్న భావన వ్యక్తమైంది. కానీ, రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్.. పూర్తిగా భారత వ్యతిరేక వైఖరి తీసుకున్నారు.
వీసాల జారీ, ప్రవాసీయుల డిపోర్టేషన్ నుంచి మొదలు సుంకాల పెంపు వరకూ ఇండియా పట్ల కఠినంగా వ్యవహరించారు. అలాగే, భారత్‌లో పెట్టుబడులు పెట్టొద్దంటూ ప్రముఖ సంస్థ ఆపిల్ కంపెనీ(Apple Company)ని బెదిరించారు. భారత్‌లో తయారయ్యే ఐఫోన్లపై భారీగా పన్నులు విధిస్తానని హెచ్చరించారు. అంతేకాదు, తాజాగా ఇండియన్లను(Indians) ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని ప్రముఖ టెక్ కంపెనీలకు సూచించారు. భారత్‌సహా విదేశాల నుంచి ఉద్యోగులను నియమించడం ఆపాలని ఆదేశించారు. చైనాలో ఫ్యాక్టరీలు నిర్మిస్తూ, భారత్ నుంచి ఉద్యోగులను నియమించుకుంటూ, అమెరికాలో అందే సదుపాయాలు, సౌకర్యాలు అనుభవిస్తామంటే కుదరదని హెచ్చరించారు.
Donald Trump | నవ్వుల పాలు..
ట్రంప్ వైఖరి కారణంగా అగ్రరాజ్యం ప్రపంచం ముందు నవ్వుల పాలవుతోంది. ప్రతీ దానికి తానే కారణమని బాకా ఊదడం అధ్యక్షుడిగా అలవాటుగా మారింది. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకోవడం విమర్శలకు తావిచ్చింది. పాక్ కాల్పుల విరమణకు ముందుకు రావడంతోనే తాము దాడులను ఆపామని భారత్ పలుమార్లు ప్రకటించినప్పటికీ, ట్రంప్ అదే పాట పాడుతున్నారు. ఇక, అధికారంలోకి రాగానే రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతానాని బీరాలు పలికిన అధ్యక్షుడు ఇప్పటికీ దాన్ని నిలువరించ లేకపోయాడు. ట్రంప్‌ను లైట్‌గా తీసుకున్న రష్యా(Russia) ఉక్రెయిన్‌పై దాడులు చేస్తూనే ఉంది.
Donald Trump | వీసాలు, డిపోర్టేషన్‌పై విమర్శలు..
అగ్రరాజ్య పగ్గాలు చేపట్టిన ట్రంప్.. వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి అమెరికా మనుగడ సాగిస్తున్నదే వలస ప్రజల కారణంగా శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి మొదలు పారిశ్రామిక రంగాల వరకు, వైద్యారోగ్యం నుంచి మొదలు హౌస్ కీపింగ్ వరకూ అన్నింట్లోనూ ప్రవాసీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించడంలో ప్రధానంగా భారతీయుల పాత్ర గణనీయంగా ఉంది.
శాస్త్ర సాంకేతిక రాంగాలతో పాటు ఐటీ, విద్య, వైద్య రంగాల్లో ఇండియన్లు చేస్తున్న కృషితోనే అమెరికా ముందుకు సాగుతోంది. ముఖ్యమైన రంగాల్లో 30 శాతం భారతీయులు అమెరికాకు సేవలందిస్తున్నారు. ట్రంప్ వైఖరి వల్ల ఇండియన్లతో పాటు వివిధ దేశాల వారు వెనక్కు వెళ్లిపోతే అగ్రరాజ్యం పతనమవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ పిచ్చి నిర్ణయాలు ఇక నైనా ఆపాలని హితవు పలుకుతున్నారు.