అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajeev Kanakala | టాలీవుడ్ నటుడు, యాంక్ సుమ భర్త రాజీవ్ కనకాల ఓ భూ వివాదంలో చిక్కుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఆయనకు నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట(Amberpet) పసుమాముల ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం రాజీవ్ కనకాల ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్లాట్‌ను విజయ్ చౌదరి అనే వ్యక్తికి విక్రయించారు. ఆ తర్వాత విజయ్ కూడా అదే స్థలాన్ని మళ్లీ మరో వ్యక్తికి రూ. 70 లక్షలకు అమ్మేశారు. అయితే, నన్ను మోసం చేసి స్థలం అమ్మారని కొత్త కొనుగోలుదారు ఆరోపించాడు. తనకు చూపించిన స్థలం అక్కడ లేదని, నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents) ఆధారంగా మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్(Hayatnagar Police Station)లో ఫిర్యాదు చేశాడు.
Rajeev Kanakala | భలే ఇరుక్కున్నాడే..
బాధితుడి ఫిర్యాదు మేరకు విజయ్ చౌదరి పై కేసు నమోదు చేశారు. ఈ లావాదేవీకి సంబంధించి ముందుగా స్థలాన్ని విక్రయించిన రాజీవ్ కనకాల(Rajeev Kanakala)ను కూడా విచారించేందుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజీవ్ కనకాల విక్రయించిన స్థలం వాస్తవంగానే ఉందా? లేదా దాన్ని నకిలీగా చూపించారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ కేసులో రాజీవ్ కనకాల పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన పోలీసులకు ఏ మేరకు సహకరిస్తారన్న అంశం మీద ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రజలలో చర్చ జరుగుతోంది.
రాజీవ్ కనకాల తెలుగు చిత్రసీమలో బిజీగా ఉన్న నటుల్లో ఒకరు. పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన ‘హోమ్‌టౌన్’ వెబ్ సిరీస్ ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఝాన్సీ కూడా ప్రధాన పాత్ర పోషించారు. తన ప్రత్యేకమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రాజీవ్ కనకాల, ప్రస్తుతం ఈ భూ వివాదం అంశంతో వివాదాస్పదంగా మారారు. ఈ కేసు ఎలా మలుపుతీసుకుంటుందో, రాజీవ్ కనకాల దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అధికారిక విచారణ పూర్తి అయ్యే వరకూ, ఈ అంశం చుట్టూ పలు ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.