AB De Villiers
AB de Villiers | దంచికొట్టిన డీవిలియ‌ర్స్.. భారత్‌పై సౌతాఫ్రికా చాంపియన్స్ ఘన విజయం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ :AB de Villiers | వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భాగంగా సీనియ‌ర్ ఆట‌గాళ్లు అద్భుత‌మైన క్రికెట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. తాజాగా యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ తమ మొదటి మ్యాచ్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) సారథ్యంలోని దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టుతో ఆడింది.

వాస్తవానికి ఇండియా ఛాంపియన్స్ జట్టు మొదటి మ్యాచ్ పాకిస్థాన్‌తో షెడ్యూల్ చేయబడ‌గా, కొంద‌రు భారత ఆటగాళ్లు మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో అది రద్దయ్యింది. ఈక్ర‌మంలో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టు(South Africa Champions Team)తో పోటీ ప‌డ్డారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు భారత్ ఛాంపియన్స్​(India Champions)పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి నాయకుడిగా నిలిచాడు ఏబీ డివిలియర్స్.

AB de Villiers | అద‌ర‌గొట్టాడు..

కెప్టెన్​గా బరిలోకి దిగిన డివిలియర్స్(De Villiers), కేవలం 30 బంతుల్లోనే 63 నాటౌట్ పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తి స్థాయిలో సౌతాఫ్రికా వైపు తిప్పేశాడు. తొమ్మిదో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఆయన, ధాటిగా ఆడి 4 సిక్సర్లు, 3 ఫోర్లతో భారత బౌలింగ్‌కి చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 28 బంతుల్లోనే 50 ప‌రుగులు చేయ‌డం విశేషం. అంతకుముందు హషీమ్ అమ్లా (Hashim Amla) (22) మరియు జాక్వెస్ రుడాల్ఫ్ (24) ప‌ర్వాలేద‌నిపించారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోతున్న స‌మ‌యంలో భారత్ కాస్త గట్టెక్కినట్లు అనిపించింది. కానీ డివిలియర్స్ లాంటి ఆటగాడు పిచ్​పై ఉన్నంతవరకూ గేమ్ ఎలా మారుతుంది అన్న‌దానికి నిదర్శనంగా నిలిచింది ఈ మ్యాచ్.

యూసుఫ్ పఠాన్(Yusuf Pathan) రెండు కీలక వికెట్లు తీసినా, తర్వాత సౌతాఫ్రికా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మోర్నే వాన్ విక్ (18 నాటౌట్ 5 బంతుల్లో) చివర్లో చెలరేగి భారీ స్కోరు 206/6 (20 ఓవర్లలో) న‌మోద‌య్యేలా చేశాడు. ఇక భారత్ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది. 111/9 స్కోరుకే 18.2 ఓవర్లలో కుప్పకూలింది. DLS విధానంలో 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్టువర్ట్ బిన్నీ ఒక్కడే (37 నాటౌట్) కొంత ప్రతిఘటన చూపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో అరోన్ ఫాంగిసో 3 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు, వేన్ పర్నెల్ 2 వికెట్లు తీసి భారత బ్యాటర్లను తిప్పలు పెట్టారు. ఈ విజయంతో సౌతాఫ్రికా తమ స్థాయిని మరోసారి నిరూపించగా, డివిలియర్స్ ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఫిదా చేసింది. “బ్యాటింగ్ అంటే ఇదే!” అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.