అక్షరటుడే, హైదరాబాద్: police jobs : తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు కసరత్తు మొదలైంది. తాజా అంచనాల ప్రకారం దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
2007లో లుంబినీపార్కు, గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్నాక.. పోలీసు శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 35 వేల పోలీసు నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కానందున, విడతల వారీగా నియామకం కొనసాగుతోంది. అప్పుడప్పుడు వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతోంది. కొత్తగా మంజూరైన పోస్టుల నియామక ప్రక్రియ చివరిసారి 2022లో చేపట్టిన నియామకంతో పూర్తయింది.
2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై, శిక్షణ తీసుకున్న ఎస్సై, కానిస్టేబుల్స్‌కు 2024లో సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు elangana State Police Recruitment Board అప్పుడు 17 వేల పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో పోలీసు నియమకాల భర్తీకి పోలీసుశాఖ సన్నద్ధమవుతోంది. ప్రాథమికంగా కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా వేసినా, ఈ ఏడాది పదవీ విరమణలతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
2021 ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ అప్పటి భారాస సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021లో పదవీ విరమణ చేయాల్సి వారు 2024 మార్చి వరకు విధుల్లో కొనసాగారు. 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణలు కొనసాగుతున్నాయి. ఇలా ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉంది.