అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | ప్రియుడిపై మోజుతో కట్టుకున్నోడినే కడతేర్చేందుకు యత్నించిన ఓ ఇల్లాలి ప్రయత్నం బెడిసికొట్టి చివరకు కటకటాలపాలైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్పీ రాజేశ్‌చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.
మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు (Ghanpur) చెందిన సాడెం కుమార్ మెదక్ మున్సిపాలిటీలో (Medak Municipality) ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే అల్వాల్‌కు (Alwal) చెందిన కాంపల్లి మహేష్.. రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా తంగలపల్లిలోని లలితమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కుమార్ భార్య రేణుకకు పూజారి మహేశ్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో కుమార్‌ను అడ్డు తొలగించుకుంటే, అతని ఉద్యోగంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని రేణుక ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా ప్రియుడితో కలిసి భర్త హత్య కోసం అల్వాల్‌కు చెందిన మహ్మద్ అశ్ఫాక్‌తో రూ.15 లక్షలకు సుపారీ కుదుర్చుకుంది. రూ.2 లక్షలు అడ్వాన్సు కూడా చెల్లించింది. ఈనెల 21న ఉదయం భర్త ఇంటి నుంచి బయలుదేరగానే రేణుక ప్రియుడు మహేష్‌కు సమాచారమిచ్చింది.
దీంతో అతను సుపారీ గ్యాంగ్‌కు తెలపడంతో అశ్ఫాక్ తన అనుచరులతో కలిసి ఫరీద్‌పేట(Faridpet) శివారులోని సోలార్ ప్లాంట్ (Solar plant) వద్ద కుమార్‌ను వెంబడించి రాడ్లు, గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశారు. అదే సమయంలో ఓ కారు రావడాన్ని గమనించి దుండగులు పారిపోగా, కారులోని వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో వారు చేరుకుని కుమార్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు హత్యాయత్నం కేసులో మహేష్, రేణుకతో పాటు సుపారీ గ్యాంగ్ మహ్మద్ అశ్ఫాక్, మహ్మద్ ముబీన్, మహ్మద్ యాకుబ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి కారు, ఆటో, గొడ్డలి, రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు చెప్పారు. కేసును చేధించడంలో చాకచక్యంగా పనిచేసిన రూరల్ సీఐ రామన్ (Rural CI Raman), ఎస్సై అనిల్, క్రైం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.