అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు (Tahsildar offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కేంద్రాల్లో అటెండర్, ఆపరేటర్ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ వరకు లంచాలు తీసుకుంటారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు అన్ని సక్రమంగా ఉన్నా.. ఆపరేటర్‌కు రూ.500 నుంచి రూ.వెయ్యి ఇచ్చుకోవాల్సిందే. లేదంటే పనులు కావు. రేపు రాపో అని పంపిస్తారు. ఇక రిజిస్ట్రేషన్ల విషయంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే రూ.లక్షలు డిమాండ్ చేస్తారు. తాజాగా రూ.రెండు లక్షల లంచం అడిగిన ఓ డిప్యూటీ తహశీల్దార్‌పై ఏసీబీ అధికారులు (ACB Officers) కేసు నమోదు చేశారు.
సిద్దిపేట (Siddipet) జిల్లా ములుగు మండల తహశీల్దార్ కార్యాలయంలో యెలగందుల భవాని డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తోంది. అయితే పట్టాదార్ పాస్ పుస్తకం కోసం ఇటీవల ఓ వ్యక్తి కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో డిప్యూటీ తహశీల్దార్ భవాని అతని నుంచి రూ.రెండు లక్షల లంచం డిమాండ్ చేసింది. దీంతో సదరు వ్యక్తి బంధువు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. శుక్రవారం కార్యాలయంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు.
ACB Case | మారని తీరు..
లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. తమ పని తాము చేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఒక విధిగా భావిస్తున్నారు. ఎంతోస్తే అంత అన్నట్లు రూ.వందల నుంచి రూ.లక్షల వరకు ఆయా వ్యక్తులను బట్టి అడుగుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ(Revenue), మున్సిపల్ (Municipal) కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. ఆయా కార్యాలయాల్లోని పలువురు అధికారులు లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. వారిలో భయం లేకపోవడం గమనార్హం.